న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను అదానీ అవినీతి అంశం, ఉత్తరప్రదేశ్‌లో సంభాల్ హింసాకాండ ఘటనలు కుదిపేస్తున్నాయి. ఈ అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుపడుతుండటంతో ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సైతం పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో విపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సమావేశమయ్యారు.
ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు రాగా.. ముఖ్యంగా ఉభయసభల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎదుర్కొనే వ్యూహంపై తీవ్రంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.. అయితే ఈ కీలక సమావేశానికి ఇండియా కూటమిలో భాగంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ డుమ్మా కొట్టింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ హింస అంశం వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలనుకుంటున్నట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి.
కానీ కాంగ్రెస్ మాత్రం అదానీ వ్యవహారంపై మాత్రమే ఒత్తిడి చేయాలనుకుంటోందని.. దీంతో నేడు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశానికి హాజరుకావడం లేదని ఆ పార్టీ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. తమ ప్రధాన అంశాలు ఎజెండాలో లేనప్పుడు సమావేశానికి హాజరు కాబోమని తృణమూల్ నేతలు తెలిపినట్లు పేర్కొన్నాయి.
మరోవైపు అదానీ గ్రీన్‌పై యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపణలపై చర్చించే వరకు హౌస్‌లోని కార్యకలాపాలను నిలిపివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సోమవారం ఉదయం కూడా కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అదానీ సమస్యపై చర్చించేందుకు లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అయితే, కాంగ్రెస్‌తో సహా పలు పార్టీల ఎంపీలు ఫెంగల్ తుఫాను కారణంగా సంభవించిన నష్టం, మసీదు సర్వేపై ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో హింస, బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సన్యాసులను లక్ష్యంగా చేసుకోవడం, పంజాబ్‌లో వరి సేకరణలో జాప్యం వంటి అనేక ముఖ్యమైన సమస్యలపై చర్చలు జరపాలని పట్టుబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment