పార్టీ ఏంపీలతో కలసి విలేకరులతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన ప్రసంగానికి సవరణలు ప్రతిపాదిస్తామని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీల ప్రస్తావన రాష్ట్రపతి ప్రసంగంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మగడ్డను చంద్రబాబు చంద్రముఖిలా ఆవహించారని, టీడీపీ కమిషనర్‌లా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఏపీ భవన్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, సత్యవతి, మాధవి, బెల్లాన చంద్రశేఖర్, అయోథ్య రామిరెడ్డి, బ్రహ్మానందరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ అంశాలేవీ..
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో వైఎస్సార్‌సీపీ నుంచి కొన్ని సవరణలు ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నాం. ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన ప్రొవిజన్స్‌లో అమలుకు నోచుకోని అంశాలపై సవరణలు ప్రతిపాదిస్తాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆరు దఫాలు, హోంమంత్రి అమిత్‌షాను 10 దఫాలు కలిసి విజ్ఞప్తి చేశాం. అయినా అమలు కాలేదు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు అనుమతులకు నోచుకోలేదు. విశాఖపట్నం రైల్వే జోన్ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.
ఈ మూడు అంశాలపై ప్రతిపాదనలు చేస్తాం. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ కనీస మద్దతు ధర కల్పించాలని కోరతాం. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. నదులను అనుసంధానం చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి రాష్ట్రాల జియోగ్రాఫికల్ ఆధారంగా నదుల్లో ప్రవాహ జలాలను విభజించి కేటాయింపులు చేయాలని కోరతాం. రైతుల కోసం జాతీయ కమిషన్ (నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్) అనే ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంటుకు సమర్పించాం. దీన్ని కూడా ప్రస్తావిస్తాం. కరోనా కారణంగా పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు దెబ్బతిన్నాయి. బడ్జెట్‌లో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుని అభివృద్ధి దిశగా ఉండేలా కేంద్రం చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు ఆదాయపు పన్ను స్టాండర్డ్ డిడక్షన్ రూ.లక్షకు పెంచాలని కోరనున్నాం. మరో 13 అంశాలపై కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు పొందటం, రాష్ట్రానికి వనరులు చేకూర్చడం, సమస్యలు పరిష్కరించడం కోసం కృషి చేస్తాం.
శరీరం మాత్రమే నిమ్మగడ్డది.. ఆత్మ ‘చంద్ర’ముఖిది
కరోనా కేసులు లేనప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు డైరెక్షన్‌లో.. ప్రభుత్వానికి చెప్పకుండానే నిలిపివేసిన వ్యక్తి నిమ్మగడ్డ రమేష్. ఇప్పుడు చంద్రబాబుతో లాలూచీ పడి కరోనా తగ్గకపోయినా హఠాత్తుగా పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇంత చౌకబారుగా వ్యవహరించటం దురదృష్టకరం. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. దానికి పార్టీల గుర్తులు ఉండవు. అటువంటిది 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకు ఏవిధంగా మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఆ మేనిఫెస్టోలో పైన మూడు బొమ్మలు.. కింద రెండు బొమ్మలు పెట్టారు. అందులో మొదటి బొమ్మ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన లోకేశ్‌ది, రెండోది అల్లుడి చేతిలో వెన్నుపోటుకు గురై మరణించిన ఎన్టీఆర్‌ది.
మూడోది ఆలయాల్లో దొంగతనాలు చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, దొంగతనాల సంఘానికి ఉపాధ్యక్షుడు అయిన అచ్చెన్నాయుడుది. నాలుగోది వెన్నుపోటుదారుల జాతీయ సంఘం అధ్యక్షుడు చంద్రబాబు ఫొటోను ముద్రించుకున్నారు. పార్టీల రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలను రాజకీయం చేయడం, ఈ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం చట్ట విరుద్ధం. చంద్రబాబు మీద ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిమ్మగడ్డ మతిభ్రమించిన వ్యక్తి. తక్షణం ఆయన మానసిక పరిస్థితిపై మెడికల్ బోర్డుకు రిఫర్ చేసి, ఆయన మానసిక స్థితి సరిగా ఉందా.. లేదా అనేది పరిశీలన జరపాలి. మతిభ్రమించినట్టు వ్యవహరిస్తున్న నిమ్మగడ్డను కచ్చితంగా ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపించాలి.
Comments
Please login to add a commentAdd a comment