న్యూఢిల్లీ/లఖీమ్‌పూర్ ఖేరి: రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం రాష్ట్రపతి కోవింద్‌ను కలిసి లఖీమ్‌పూర్‌ఖేరి ఘటనపై వినతిపత్రం అందజేయనున్నారు. ఈ బృందంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, గులామ్ నబీ ఆజాద్, లోక్‌సభ పార్టీ నేత అధిర్ రంజన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ ఉంటారు. హింసాత్మక ఘటనలపై రాష్ట్రపతికి పూర్తి వివరాలను అందజేస్తామని పార్టీ నేత వేణుగోపాల్ తెలిపారు. మంత్రి కుమారుడు రైతులపైకి వాహనం నడిపిన ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృతి చెందిన ఈ ఘటనకు సంబంధించి మంత్రి కుమారుడు ఆశిష్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అంతిమ్ అర్దాస్‌లో పాల్గొన్న ప్రియాంక
లఖీమ్‌పూర్‌ఖేరి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు అంతిమ ప్రార్థనలు జరిపేందుకు మంగళవారం టికోనియా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, బీకేయూ నేతలు రాకేశ్ తికాయత్, దర్శన్‌సింగ్ పాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, ధర్మేంద్ర మాలిక్ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొన్నారు. హింసాత్మక ఘటనలో అసువులు బాసిన రైతుల కుటుంబసభ్యులు కార్యక్రమ ంలో పాల్గొన్నారు. ప్రకటించిన విధంగానే, వేదికపై రాజకీయ పార్టీల నేతలెవరికీ చోటు కల్పించలేదు. కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో పోలీసులు, పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment