న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల ఉరికి రంగం సిద్ధమైంది. 2012 నాటి నిర్భయ అత్యాచార కేసు దోషి ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించడం.. తీహార్ జైలు అధికారుల అభ్యర్థన మేరకు ఢిల్లీ కోర్టు నలుగురు దోషులపై మరోసారి డెత్‌వారెంట్లు జారీ చేయడంతో ఫిబ్రవరి 1న ఉదయం ఆరుగంటలకు వారి ఉరితీత ఖరారైంది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 22నే నిర్భయ దోషులకు ఉరిపడాల్సి ఉండగా.. ముఖేష్ సింగ్ అనే దోషి తనను క్షమించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ సమర్పించారు.
ఢిల్లీ ప్రభుత్వం ద్వారా అందిన పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవనానికి పంపింది. ఆ వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిటిషన్‌ను పరిశీలించడంతోపాటు తిరస్కరిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో తీహార్ జైలు అధికారులు తాజా డెత్ వారెంట్లు కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించడం, కోర్టు వెంటనే వాటిని జారీ చేయడం చకచక జరిగిపోయాయి.
నిర్భయ తండ్రి హర్షం..
తన కూతురిపై అత్యాచారానికి పాల్పడినవారిలో ఒకరైన ముఖేష్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంపై నిర్భయ తండ్రి శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ‘‘వాళ్లకు ఉరిపడటం దాదాపుగా ఖాయమైనందుకు సంతోషంగా ఉంది. క్షమాభిక్ష పెట్టిన వెంటనే తిరస్కరిస్తారని మాకు భరోసా ఇచ్చారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 22న జరగాల్సిన ఉరితీత వాయిదా పడటం నిరాశకు గురిచేసిందని, తాజా పరిణామాలతో మళ్లీ ఆశలు చిగురించాయన్నారు.
నిర్భయ ఘటన..
2012 డిసెంబర్‌లో నిర్భయపై ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్ అనే నలుగురితోపాటు మరికొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడటం, ఈ క్రమంలో అయిన తీవ్ర గాయాలకు చికిత్స పొందుతూ నిర్భయ కొన్ని రోజుల తరువాత సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో మరణించడం మనకు తెలిసిన విషయమే. ఈ ఘోర సంఘటనకు స్పందనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
2013 మార్చిలో ఐదుగురు నిందితులపై కేసు విచారణ మొదలైంది ఈలోపుగా ప్రధాన నిందితుడైన రామ్‌సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుల్లో మరొకరు జువెనైల్ కావడంతో అతడిని మూడేళ్లపాటు జువెనైల్ హోంలో ఉంచి ఆ తరువాత విడుదల చేశారు.మిగిలిన నలుగురి నిందితుల విచారణ తరువాత 2013 సెప్టెంబర్‌లోనే న్యాయస్థానం దోషులు నలుగురికీ ఉరిశిక్ష ఖరారు చేసింది.
మైనర్‌నంటూ సుప్రీంకోర్టుకు..
నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా.. నేరం జరిగిన సమయంలో తాను మైనర్‌నంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గతంలో ఇదే పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టులో దరఖాస్తు చేయగా, దాన్ని హైకోర్టు కొట్టేసింది. విచారణ సమయంలో దోషి తరఫు న్యాయవాది హాజరుకాక పోవడంతో అతనిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే వ్యవహారంపై పవన్ కుమార్ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment