clemency petition
-
బతుకు ఆగం జేసిన బొమ్మ తుపాకీ! 30 ఏళ్లు జైల్లో..
ఆ పెద్దాయనకు అస్సలు కిస్మత్ బాగోలేదు. అందుకే ముప్ఫైఏళ్ల క్రితం బొమ్మ తుపాకీతో బెదిరించి ఓ చోరీ చేశాడు. అదృష్టం బాగోలేక దొరికాడు. అది బొమ్మదని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. జీవిత ఖైదులో ముప్పై ఏళ్లు జైల్లోనే మగ్గాడు. చివరికి క్షమాభిక్ష దొరకడంతో జైలు నుంచి బయటపడేందుకు సిద్ధం అయ్యాడు. రోల్ఫ్ కయెస్టెల్(70).. అర్కన్సస్ రాష్ట్రంలో 1981లో ఓ చిరుతిళ్ల షాపులో దొంగతనం చేశాడు. బొమ్మ తుపాకీతో కౌంటర్ మీద ఉన్న వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఆ దొంగతనం కేసులో 40 ఏళ్ల జైలు శిక్ష.. బోనస్‌గా పదిహేను వేల ఫైన్ కూడా విధించింది కోర్టు. ఇక తాను చేసింది చిన్నతప్పేనని, క్షమాభిక్ష ప్రసాదించాలని కయెస్టెల్ అభ్యర్థిస్తూనే ఉన్నాడు. అంతెందుకు అతని చేతిలో దొపిడీకి గురైన వ్యక్తి కూడా.. వదిలేయాలని అధికారులను విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు. ఐదుసార్లు క్షమాభిక్ష అప్పీల్ చేసుకున్నా అప్లికేషన్‌ను తిరస్కరించారు. సెలబ్రిటీలు సైతం అతని మంచి జీవితానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్లు నడిపించారు. చివరికి.. ఐదో సారికి అతనికి క్షమాభిక్ష దొరికింది. దీంతో పదేళ్ల ముందుగానే జైలు నుంచి బయటపడుతున్నాడు. అయితే విడుదల కోసం అతను మరో నెల రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ అసా హచిన్సన్ చేసిన ‘రోల్ఫ్ కయెస్టెల్ రిలీజ్’ ప్రతిపాదనను జనాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇంతకీ అతను దొంగిలించిన సొమ్ము ఎంతంటే.. 264 డాలర్లు. -
ముకేశ్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణకు వ్యతిరేకంగా నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘జైల్లో పడిన బాధలు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేయలేవు’ అని కోర్టు తేల్చిచెప్పింది. జైలులో పడిన కష్టాలు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేయలేవంటూ జడ్జీలు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బోపన్న వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై న్యాయసమీక్షకు అవకాశం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ముకేశ్‌ను 8నెలలకు పైగా జైలులో ఉంచారన్న పిటిషనర్ తరపు లాయర్ వాదనలను కోర్టు అంగీకరించలేదు. రాష్ట్రపతి వేగంగా పిటిషన్‌ను తిరస్కరించారన్న ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. క్షమాభిక్ష పిటిషన్‌ను వేగంగా తిరస్కరించారన్న ముకేశ్ అభియోగాన్ని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తప్పు పట్టారు. క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయాల్లో ఆలస్యాన్ని విమర్శిస్తూ గతంలో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. క్షమాభిక్ష కేసుల్లో ఆలస్యం అమానవీయమైనదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం, హోం శాఖ ముకేశ్ తిరస్కరణకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ 4రోజుల్లో పూర్తిచేసినట్టు కోర్టు తెలిపింది. క్షమాభిక్ష పిటిషన్ ఇంత వేగంగా తిరస్కరణకు గురవడంలో ఇది రికార్డు అని కోర్టు తెలిపింది. రాష్ట్రపతికి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్.. నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్యూరేటివ్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. వినయ్ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్నారు. వినయ్ తరఫున వాదిస్తోన్న న్యాయవాది ఏపీ సింగ్.. వినయ్ పిటిషన్‌ను తానే స్వయంగా అందజేసినట్టు వెల్లడించారు. -
ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల ఉరికి రంగం సిద్ధమైంది. 2012 నాటి నిర్భయ అత్యాచార కేసు దోషి ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించడం.. తీహార్ జైలు అధికారుల అభ్యర్థన మేరకు ఢిల్లీ కోర్టు నలుగురు దోషులపై మరోసారి డెత్‌వారెంట్లు జారీ చేయడంతో ఫిబ్రవరి 1న ఉదయం ఆరుగంటలకు వారి ఉరితీత ఖరారైంది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 22నే నిర్భయ దోషులకు ఉరిపడాల్సి ఉండగా.. ముఖేష్ సింగ్ అనే దోషి తనను క్షమించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ సమర్పించారు. ఢిల్లీ ప్రభుత్వం ద్వారా అందిన పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవనానికి పంపింది. ఆ వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిటిషన్‌ను పరిశీలించడంతోపాటు తిరస్కరిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో తీహార్ జైలు అధికారులు తాజా డెత్ వారెంట్లు కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించడం, కోర్టు వెంటనే వాటిని జారీ చేయడం చకచక జరిగిపోయాయి. నిర్భయ తండ్రి హర్షం.. తన కూతురిపై అత్యాచారానికి పాల్పడినవారిలో ఒకరైన ముఖేష్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంపై నిర్భయ తండ్రి శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ‘‘వాళ్లకు ఉరిపడటం దాదాపుగా ఖాయమైనందుకు సంతోషంగా ఉంది. క్షమాభిక్ష పెట్టిన వెంటనే తిరస్కరిస్తారని మాకు భరోసా ఇచ్చారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 22న జరగాల్సిన ఉరితీత వాయిదా పడటం నిరాశకు గురిచేసిందని, తాజా పరిణామాలతో మళ్లీ ఆశలు చిగురించాయన్నారు. నిర్భయ ఘటన.. 2012 డిసెంబర్లో నిర్భయపై ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్ అనే నలుగురితోపాటు మరికొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడటం, ఈ క్రమంలో అయిన తీవ్ర గాయాలకు చికిత్స పొందుతూ నిర్భయ కొన్ని రోజుల తరువాత సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో మరణించడం మనకు తెలిసిన విషయమే. ఈ ఘోర సంఘటనకు స్పందనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 2013 మార్చిలో ఐదుగురు నిందితులపై కేసు విచారణ మొదలైంది ఈలోపుగా ప్రధాన నిందితుడైన రామ్‌సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుల్లో మరొకరు జువెనైల్ కావడంతో అతడిని మూడేళ్లపాటు జువెనైల్ హోంలో ఉంచి ఆ తరువాత విడుదల చేశారు.మిగిలిన నలుగురి నిందితుల విచారణ తరువాత 2013 సెప్టెంబర్‌లోనే న్యాయస్థానం దోషులు నలుగురికీ ఉరిశిక్ష ఖరారు చేసింది. మైనర్‌నంటూ సుప్రీంకోర్టుకు.. నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా.. నేరం జరిగిన సమయంలో తాను మైనర్‌నంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గతంలో ఇదే పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టులో దరఖాస్తు చేయగా, దాన్ని హైకోర్టు కొట్టేసింది. విచారణ సమయంలో దోషి తరఫు న్యాయవాది హాజరుకాక పోవడంతో అతనిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే వ్యవహారంపై పవన్ కుమార్ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. -
నిర్భయ దోషికి క్షమాభిక్ష వద్దు!
న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు శుక్రవారం కేంద్ర హోంశాఖ సిఫారసు చేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ సిఫారసును రాష్ట్రపతికి పంపించింది. దిశ హత్యాచార నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన రోజే ఈ సిఫారసు చోటు చేసుకుంది. మరోవైపు, క్షమాభిక్ష వినతిని తోసిపుచ్చాలని నిర్భయ తల్లి కూడా రాష్ట్రపతిని కోరింది. 2012 డిసెంబర్లో నిర్భయను ముకేశ్, పవన్, వినయ్, అక్షయ్‌లు పాశవికంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అనంతరం ఆ నలుగురికి కోర్టు మరణశిక్ష విధించింది. వారిలో వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. ఏడేళ్లు గడచిపోయినా, తమకు న్యాయం జరగలేదని, అదే అవేదనను ఇంకా అనుభవిస్తూనే ఉన్నామని రాష్ట్రపతికి రాసిన లేఖలో నిర్భయ తల్లి వివరించారు. తమలా కాకుండా, దిశ తల్లిదండ్రులకు సత్వరమే న్యాయం లభించిందని ఆ లేఖలో ప్రస్తావించారు. -
క్షమాభిక్షపై అర్ధరాత్రి హైడ్రామా
హస్తిన కేంద్రంగా యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు, క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ లాంటి అంశాలపై బుధవారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాత్రికి రాత్రే హడావుడిగా నిర్ణయం తీసుకోవాలని అనుకోవట్లేదంటూ జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. అయితే, రాత్రి దాదాపు 8 గంటల నుంచి 10.30 గంటల వరకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్.. రాష్ట్రపతి భవన్ లోనే, ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. మరోవైపు ప్రణబ్ ముఖర్జీ ఇదే అంశంపై సాలిసిటర్ జనరల్ ను కూడా సలహా అడిగారు. అన్నీ అయిన తర్వాత రాత్రి 10.45 గంటల సమయంలో యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించినట్లు బయటకు తెలిసింది. దాంతో ఉత్కంఠకు తెరవీడింది. మరోవైపు మహారాష్ట్రలోని నాగపూర్ లో కూడా ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. నాగపూర్ మొత్తం 144 సెక్షన్ విధించారు నాగపూర్ జైలు బయట నిషేధాజ్ఞలు విధించారు ముంబైలో పోలీసు ఉన్నతాధికారులంతా సమావేశమయ్యారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం రాగానే తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు నాగపూర్ జైలు అధికారులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు -
ఉదయం 7 గంటల్లోగా ఏ సమయంలోనైనా ఉరి!
ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష దాదాపు ఖరారైంది. రాష్ట్రపతి వద్ద అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తే, గురువారం ఉదయం 7 గంటల్లోగా అతడిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జైల్లో ఉరి తీస్తారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 7 గంటల్లోగా ఏ సమయంలోనైనా ఈ శిక్షను అమలుచేయొచ్చు. టాడా కోర్టు జారీచేసిన డెత్ వారంటును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ వారంటు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రపతి గతంలో క్షమాభిక్షను తిరస్కరించిన తర్వాత, దాన్ని 14 రోజుల్లోగా కోర్టులో సవాలు చేయాల్సి ఉండగా మెమన్ అలా చేయలేదని సుప్రీం విస్తృత ధర్మాసనం తెలిపింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను తిరస్కరించడం సరైనదేనని కూడా విస్తృత ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో, ఇక మెమన్ను ఉరి తీయడం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్న క్షమాభిక్ష పిటిషన్ విషయం తేలడం ఒక్కటే ఇక మిగిలి ఉంది. -
రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష వద్దు: కేంద్రం
దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకులకు క్షమాభిక్ష ఇవ్వద్దని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. హంతకులు దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్లో కనీస పశ్చాత్తాపం కూడా కనపడలేదని కోర్టుకు కేంద్రం తెలిపింది. అందువల్ల వారికి క్షమాభిక్ష పెట్టొద్దని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. వారి మరణ శిక్ష కేసుపై తన తీర్పును కోర్టు వాయిదా వేసింది.