ఉదయం 7 గంటల్లోగా ఏ సమయంలోనైనా ఉరి!
ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష దాదాపు ఖరారైంది. రాష్ట్రపతి వద్ద అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరిస్తే, గురువారం ఉదయం 7 గంటల్లోగా అతడిని మహారాష్ట్రలోని నాగ్పూర్ జైల్లో ఉరి తీస్తారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 7 గంటల్లోగా ఏ సమయంలోనైనా ఈ శిక్షను అమలుచేయొచ్చు.
టాడా కోర్టు జారీచేసిన డెత్ వారంటును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ వారంటు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రపతి గతంలో క్షమాభిక్షను తిరస్కరించిన తర్వాత, దాన్ని 14 రోజుల్లోగా కోర్టులో సవాలు చేయాల్సి ఉండగా మెమన్ అలా చేయలేదని సుప్రీం విస్తృత ధర్మాసనం తెలిపింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను తిరస్కరించడం సరైనదేనని కూడా విస్తృత ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో, ఇక మెమన్ను ఉరి తీయడం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్న క్షమాభిక్ష పిటిషన్ విషయం తేలడం ఒక్కటే ఇక మిగిలి ఉంది.