రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను వర్చువల్ పద్ధతిలో అందుకున్న రామస్వామి, రంగయ్య
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్థుల్లో దాగి ఉండే స్వాభావిక ప్రతిభను వెలికితీయడం తమ ప్రాథమిక బాధ్యతగా ఉపాధ్యాయులు పనిచేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. మంచి ఉపాధ్యాయుడు విద్యార్థుల వ్యక్తిత్వాన్ని నిర్మించే దార్శనికుడిగా, సమాజ నిర్మాతగా ఉంటాడని కోవింద్ పేర్కొన్నారు. ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 44 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఆదివారం వర్చువల్‌గా అవార్డులు అందజేసిన రాష్ట్రపతి.. 21వ శతాబ్దపు భారతదేశ గమ్యాన్ని ఉపాధ్యాయులే నిర్దేశిస్తారని అన్నారు. అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.
తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కెరమెరి మండలం సవర్‌ఖేడా ఎంపీపీఎస్ తాత్కాలిక ప్రధాన ఉపాధ్యాయుడు రంగయ్య కడెర్ల, సిద్దిపేటలోని ఇందిరానగర్ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు పయ్యావుల రామస్వామి, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం జిల్లా పరిషత్ హైస్కూలు ఉపాధ్యాయుడు కొణతాల ఫణి భూషణ్, చిత్తూరు జిల్లా ఎం.పైపల్లి ఈరాల జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఎస్.మునిరెడ్డి తెలుగు రాష్ట్రాలనుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో సురక్షితంగా ఉంటుంది. ప్రతివ్యక్తి జీవితంలో గురువుల పాత్ర ఎంతో ఉంటుంది. చదువుపై విద్యార్థులకు ఆసక్తిని పెంపొందించడం ఉపాధ్యాయుల విధి. ప్రతి విద్యార్థి అవసరాలను గుర్తించి ఉపాధ్యాయులు పనిచే యాలి. విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించాలి’అని అన్నారు. కాగా, దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకంగా ఉంటుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment