
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోద ముద్ర వేశారు. కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయన సుజాతలను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం ఉదయం న్యాయమూ ర్తులుగా వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణం చేయించనున్నారు.
వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 27కి చేరనుంది. మరో పది పోస్టులు ఖాళీగా ఉండగా కొన్నింటిని భర్తీ చేసేందుకు హైకోర్టు త్వరలో చర్యలు తీసుకోనుంది. న్యాయాధికారుల కోటా నుంచి కొందరి పేర్లను కొలీజియం సిఫారసు చేయనుంది. ఈ ఏడాది ముగ్గురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. ఫిబ్రవరి 11న జస్టిస్ మఠం వెంకటరమణ, జూన్ 13న జస్టిస్ మల్లవోలు సత్యనా రాయణమూర్తి, సెప్టెంబర్ 19న జస్టిస్ కొంగర విజయలక్ష్మీ పదవీ విరమణ చేయను న్నారు. ఈ ఏడాది ఆగస్టు లోపు అటు న్యాయ వాదుల కోటా, ఇటు న్యాయాధికారుల కోటా నుంచి అన్నీ ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉంది.