మదనపల్లె/సదుం (చిత్తూరు జిల్లా): విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలని, విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ అన్నారు. సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ ముంతాజ్ అలీ (శ్రీఎం) ఆహ్వానం మేరకు రాష్ట్రపతి కోవింద్ ఆదివారం మదనపల్లె వచ్చారు. సత్సంగ్ ఫౌండేషన్‌లో భారత్ యోగా విద్యాకేంద్రాన్ని ప్రారంభించి ఆవరణలో మొక్కలు నాటారు. 38 పడకల స్వస్థ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సదుం మండలం గొంగివారిపల్లెలో సత్సంగ్ ఫౌండేషన్‌కు చెందిన పీపుల్స్ గ్రోవ్ స్కూల్‌ను సందర్శించిన రాష్ట్రపతి అక్కడి విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యార్థులంతా గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యతో పాటు వ్యాయామం ఎంతో అవసరమని, ప్రతిరోజు ఉదయం యోగా చేయడాన్ని విద్యార్థులు అలవాటు చేసుకోవాలని సూచించారు. యోగా, ధ్యానం చేయడం వల్ల ఆలోచనా శక్తి మరింత మెరుగుపడుతుందని తెలిపారు. అట్టడుగు వర్గాల అభివృద్ధికి నాణ్యమైన ఉచిత విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నందుకు ఆశ్రమ నిర్వాహకులను అభినందించారు. పాఠశాలలో నూతనంగా నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్ అంతకుముందు ఆశ్రమ శివాలయంలో పూజలు నిర్వహించి హారతి స్వీకరించారు. సత్సంగ్ ఫౌండేషన్‌ను సందర్శించినందుకు గుర్తుగా ఆశ్రమ ఆవరణలో రావి మొక్క నాటారు. సుమారు 4 గంటలపాటు రాష్ట్రపతి పర్యటన సాగింది.
విద్యార్థులతో మాట్లాడుతున్న రాష్ట్రపతి కోవింద్
గొంగివారిపల్లెలో పీపుల్స్ గ్రోవ్ స్కూల్ విద్యార్థులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖాముఖి ఇలా సాగింది.
విద్యార్థి: రాష్ట్రపతిగా మీకు అనుభవంలోకి వచ్చిన సంఘటన, నేర్చుకున్న విలువలు ఏవైనా చెప్పగలరా?
రాష్ట్రపతి: ప్రతి మనిషీ జీవితాంతం నిత్య విద్యార్థే. విద్యార్థిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే.. జీవితం అనేక సవాళ్లు, ఒడిదుడుకులతో కూడుకుని ఉంటుంది. నేను నేర్చుకున్నదేమంటే.. ఏదైనా పదవి, ప్రతిష్ట వ్యక్తిగతంగా గుర్తింపులు తీసుకురావు. అనుకున్నది సాధించేందుకు కఠోర శ్రమ, నిజాయితీ, నిబద్ధత అవసరం. అవే పదవికి వన్నె తెస్తాయి. రాష్ట్రపతిగా నాకు లభించిన గొప్ప అవకాశం ప్రజలకు సేవ చేయడం.
సత్సంగ్ ఫౌండేషన్‌లో రావిమొక్కను నాటి నీళ్లు పోస్తున్న రాష్ట్రపతి కోవింద్, సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ ఎం.
విద్యార్థి: గతంలో పనిచేసిన దేశాధ్యక్షుల్లో ఎవరి నుంచైనా స్ఫూర్తి పొందారా.. ఏ లక్షణాలు మిమ్మల్ని ప్రభావితం చేశాయి?
రాష్ట్రపతి: దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో నేను చేసిన ప్రతిజ్ఞను బలంగా విశ్వసిస్తాను. భారత రాజ్యాంగ విలువలను కాపాడుతానని, పార్లమెంటరీ చట్టాలను గౌరవిస్తానని, దేశరక్షణ, సమగ్రతకు పాటుపడతానన్నాను. గాంధీజీ చెప్పినట్టుగా మంచి గుణం నిజాయితీ. నాకు తెలిసిందల్లా అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా చేసుకువెళ్లడమే. ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో స్ఫూర్తిని పొందాల్సిందే. పరిసరాలు, సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది జీవితంలో ముందుకెళ్లాలి.
రాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘ప్రతి విద్యార్థికి నేనిచ్చే సలహా ఏమంటే.. విద్య మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది. విద్య ప్రాథమిక లక్షణం సత్యం, అహింస, సర్వమత ప్రేమ. ఇంటి నుంచే గౌరవమిచ్చే సంప్రదాయం రావాలి. పెద్దలను గౌరవించడం, పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా, ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలనే భావన ప్రతి ఒక్కరిలో చిన్నప్పటి నుంచే రావాలి. ప్రతి ఒక్కరూ తరగతి గదుల్లో పాఠాలు అర్థం కాక, ట్యూషన్లను ఆశ్రయిస్తున్నారంటే విద్యా విధానంలో లోపాలు ఉన్నట్టు అంగీకరించాలి’ అని అన్నారు.
స్వస్థ ఆస్పత్రి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం వైఎస్ జగన్
రాష్ట్రపతి కోవింద్‌కు సీఎం వైఎస్ జగన్ చిప్పిలిలోని హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. కోవింద్‌కు పుష్పగుచ్ఛాన్ని అందజేసి దుశ్శాలువతో సత్కరించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు నవాజ్‌బాషా, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, వెంకటేగౌడ, సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ ఎం తదితరులు ఉన్నారు. పర్యటన ముగిసిన అనంతరం రాష్ట్రపతి బెంగళూరుకు పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment