నేవీ సిబ్బందితో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ హరిచందన్ తదితరులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘సముద్ర జలాల్లో ఎదురవుతున్న సమస్యల్ని తిప్పికొట్టేందుకు స్నేహపూర్వక దేశాలతో కలిసి భారత నౌకాదళం రాజీలేని పోరాటం చేయాలి. హిందూ మహా సముద్రంలో ప్రధాన భద్రతా భాగస్వామిగా భారత్ వ్యవహరించాలి’ అని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. విశాఖపట్నం సముద్ర జలాల్లో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి పాల్గొన్నారు. భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సుమిత్రలో ప్రయాణిస్తూ.. లంగరు వేసిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను ఆయన సమీక్షించారు. ‘‘70 శాతం నౌకలు స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. ఇది శుభపరిణామం. కోవిడ్ సమయంలో భారత నావికాదళం చేసిన సేవలు అమోఘం. స్నేహపూర్వక దేశాలకు అవసరమైన మందులను సముద్రసేతు, మిషన్ సాగర్ వంటి కార్యక్రమాల ద్వారా వారికి చేరవేసింది. వైజాగ్ అని పిలిచే విశాఖ నగరం అందమైన చారిత్రక నగరం. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుత సహకారం అందించింది’’ అని రాష్ట్రపతి కొనియాడారు. నౌకాదళంతో పాటు జాతినుద్దేశించి ప్రసంగించిన రామ్‌నా«థ్ కోవింద్ ఇంకా ఏమన్నారంటే..
ఆనందం కలిగించింది..
ఈరోజు మీతో కలిసి ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంది. నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, హెలికాప్టర్లు మొదలైన భారత నౌకాదళ సంపత్తి సామర్థ్యాన్ని సమీక్షించడం చాలా ఆనందం కలిగించింది. పీఎఫ్‌ఆర్ సందర్భంగా నిర్వహించిన విన్యాసాలు, కవాతు, ఇతర అంశాలన్నీ సముద్ర జలాల్లో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని, దేశానికి ఇండియన్ నేవీ అందిస్తున్న సేవల్ని ప్రతిబింబిస్తున్నాయి. అకస్మాత్తుగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారత నౌకాదళం ఎంత సంసిద్ధతతో ఉంటుందో ఇవి ప్రస్ఫుటిస్తున్నాయి.
వైజాగ్.. ఓ అందమైన నగరం
వైజాగ్.. అని పిలిచే విశాఖపట్నం అందమైన నగరం. శతాబ్దాల కాలంగా ముఖ్యమైన ఓడరేవుగా గుర్తింపు పొందింది. దేశాల మధ్య వాణిజ్య, వ్యాపారాలకు ఇది కీలక ప్రాంతం. ఆరో శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకూ పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థకు విశాఖపట్నం ముఖ్యమైన కేంద్రం. రానున్న రోజుల్లో కూడా ఇది కొనసాగాలి. ఇక్కడ ఏర్పాటైన తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఈ విషయాలన్నింటికీ సాక్షీభూతంగా ఉంది. 1971లో పాకిస్థాన్ యుద్ధ సమయంలో వైజాగ్ అద్భుతమైన సహకారం అందించింది. ఈ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘ది గోల్డెన్ స్వర్ణిమ్ విజయ్’ వేడుకలు ఇటీవలే ముగిశాయి. ఈ విజయోత్సవాలు తూర్పు నౌకాదళం పాటవాల్ని గుర్తుచేస్తుంటాయి. పాకిస్థాన్ జలాంతర్గామి ’ఘాజీ’ని సముద్రంలో జలసమాధి చేయడమనేది పాక్‌కు నిర్ణయాత్మక దెబ్బ. ఈ ఘటన తర్వాతే 1971 యుద్ధం దేశ చరిత్రలో అత్యంత బలమైన విజయాలలో ఒకటిగా నిలిచింది.
నౌకాదళ సేవలు ప్రశంసనీయం
సముద్ర భద్రతని పటిష్టపర్చుకుంటూ.. దేశంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, అందరికీ భద్రత కల్పించేందుకు నౌకాదళం దృష్టి కేంద్రీకరించాలి. మిత్ర దేశాలతో సహకార చర్యలు కొనసాగించాలి. ప్రపంచ వాణిజ్యంలో సింహభాగం శాసిస్తున్న హిందూ మహా సముద్ర ప్రాంతం భద్రతాపరంగా చాలా కీలకం. ఇక్కడ ఏ చిన్న సంఘటన ఎదురైనా సత్వరమే స్పందిస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్న భారత నౌకాదళ సేవలు ప్రశంసనీయం. ముఖ్యంగా.. కోవిడ్ కష్ట కాలంలో భారత నౌకాదళం అందించిన సేవలు శ్లాఘనీయం. ఔషధాలను సరఫరా చేయడంతోపాటు వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో కీలకంగా వ్యవహరించింది. హిందూ మహా సముద్రంలో ఏ సమస్య తలెత్తినా.. ‘ప్రాధాన్య భద్రతా భాగస్వామి’గానూ. ‘మొట్టమొదట స్పందించే దేశంగానూ భారత్ ముందు వరుసలో నిలబడాలని కాంక్షిస్తున్నాను.
ఏపీ ప్రభుత్వానికి అభినందనలు
ఇండియన్ నేవీ స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపుతో ముందంజలో ఉంటూ ఇటీవల కాలంలో తయారుచేస్తున్న యుద్ధ నౌకలు, జలాంతర్గాముల్లో 70 శాతం స్వదేశీ పరిజ్ఞానం ఉండటం భారత్ గర్వించదగ్గ విషయం. అణు జలాంతర్గాముల్నీ నిర్మిస్తున్నాం. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు తయారుచేస్తున్న అగ్రదేశాల సరసన భారత్ నిలవడం గర్వకారణం. ఐఎన్‌ఎస్ విక్రాంత్ నిర్మాణంతో ఇది సాధ్యమైంది. గతేడాది డిసెంబర్‌లో నా కొచ్చి పర్యటనలో ‘విక్రాంత్’ను పరిశీలించాను. ’ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణానికి ఇది నాంది పలుకుతోంది. ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక విన్యాసాల్ని నిరంతరం నిర్వహిస్తుండటం ద్వారా.. స్నేహపూర్వక దేశాలతో సత్సంబంధాలు పటిష్టం చేసుకుంటూ ఇంటర్ ఆపరేబిలిటీని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది.
సముద్ర సమస్యలను పరిష్కరించడానికి పరస్పర సహకార భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలి. ఈ విషయంలో త్వరలో నిర్వహించనున్న మిలాన్–2022 విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ చారిత్రాత్మకమైన విన్యాసాలకు ఆహ్వానం పలుకుతున్న భారత నౌకాదళాన్ని అభినందిస్తున్నాను. అలాగే, పీఎఫ్‌ఆర్, మిలాన్–2022 వేడుకల్ని ఘనంగా నిర్వహించే విషయంలో పూర్తి సహకారం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాను. పీఎఫ్‌ఆర్ విజయవంతం చేసేందుకు మద్దతు పలికిన జిల్లా అధికారులు, విశాఖ ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు ఎంతో సంతృప్తినిచ్చింది. భారత నౌకాదళాన్ని చూసి దేశం గర్విస్తోంది. భారతదేశ జాతీయ ప్రయోజనాలను పరిరక్షిస్తున్న భారత నౌకాదళానికి శుభాకాంక్షలు చెబుతున్నాను.. అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ప్రసంగాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment