నౌకా విన్యాసాలకు సర్వం సన్నద్ధం | Ramnath Kovind To Attend Navy Stunts in Visakha | Sakshi
Sakshi News home page

నౌకా విన్యాసాలకు సర్వం సన్నద్ధం

Published Sun, Feb 13 2022 4:52 AM | Last Updated on Sun, Feb 13 2022 10:56 AM

Ramnath Kovind To Attend Navy Stunts in Visakha - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మరికొద్ది రోజుల్లో నగరంలో జరగనున్న రెండు భారీ నౌకాదళ విన్యాసాలకు విశాఖపట్నం వేదిక కాబోతోంది. ఇందుకోసం సాగర తీరం సర్వహంగులతో సన్నద్ధమవుతోంది. ఈనెల 21న ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, 25 నుంచి మార్చి 4 వరకు మిలాన్‌–2022 అంతర్జాతీయ నావికా విన్యాసాలతో విశాఖ అంతర్జాతీయ పటంలో మరోసారి మెరుపులు మెరిపించనుంది. ఈ నేపథ్యంలో.. భారత నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే విన్యాసాల కోసం విశాఖ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.

ఫ్లీట్‌ రివ్యూ ఎందుకంటే..
1971లో పాకిస్తాన్‌లోని కరాచీ పోర్టుపై దాడిచేసి విజయపతాక ఎగురవేసిన చరిత్ర ఈ దళానిది. అప్పటి నుంచి భారతీయ నౌకాదళంలో ఈఎన్‌సీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. అందుకే ప్రధాన విన్యాసాలకు కేంద్రంగా.. అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూలకు వేదికగా విశాఖ నిలుస్తోంది. 2006లో మొదటిసారిగా ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ నిర్వహించి సత్తాచాటిన విశాఖ నగరం.. 2016లో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూతో ప్రపంచమంతా నగరం వైపు చూసేలా కీర్తి గడించింది. ఇప్పుడు రెండో పీఎఫ్‌ఆర్‌తో మొట్టమొదటిసారిగా మినీ ఐఎఫ్‌ఆర్‌గా పిలిచే మిలాన్‌–2022కి ముస్తాబవుతోంది. 

20న రాష్ట్రపతి రాక
ఈనెల 21న జరిగే పీఎఫ్‌ఆర్‌ కోసం 20వ తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విశాఖకు చేరుకోనున్నారు. ఆయనకు సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌దాస్‌ గుప్తా సాదర స్వాగతం పలుకుతారు. ఈఎన్‌సీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రపతి బసచేస్తారు. 21న ఉ.9 గంటలకు ఫ్లీట్‌ రివ్యూ మొదలుకానుంది. 11.45 వరకూ జరిగే ఈ రివ్యూలో నేవీతో పాటు కోస్ట్‌గార్డ్, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన సుమారు 60 నౌకలతోపాటు సబ్‌ మెరైన్లు, 50కిపైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లని నాలుగు వరుసల్లో నిలుపుతారు. వీటిని త్రివిధ దళాధిపతి అయిన రాష్ట్రపతి యుద్ధనౌకలో నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షిస్తారు. చివరిగా భారతీయ నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ ఏకకాలంలో తమ గౌరవ వందనాన్ని అందజేసేందుకు పైకి ఎగురుతూ రాష్ట్రపతికి సెల్యూట్‌ చేస్తాయి. అనంతరం పీఎఫ్‌ఆర్‌కు సంబంధించిన తపాలా బిళ్లని, పోస్టల్‌ కవర్‌ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు.  

25 నుంచి మిలాన్‌ మెరుపులు..
ఇక పీఎఫ్‌ఆర్‌ తర్వాత.. 25వ తేదీ నుంచి వివిధ దేశాల నౌకాదళాల మధ్య స్నేహపూర్వక సత్సంబంధాలను బలోపేతం చేసేలా మిలాన్‌–2022 విన్యాసాలు ప్రారంభమవుతాయి. మార్చి 4 వరకూ జరిగే ఈ విన్యాసాల్లో 46కి పైగా దేశాల నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటాయి. నిజానికి.. 1995లో మిలాన్‌ విన్యాసాలు ప్రారంభమయ్యాయి.   రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2014లో 17 దేశాలు పాల్గొని అతిపెద్ద ఫ్లీట్‌ రివ్యూగా చరిత్రకెక్కింది. 

27న ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌
మరోవైపు.. 25న అన్ని దేశాలకు చెందిన ప్రతినిధులు విశాఖ చేరుకుంటారు. 26న కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధికారికంగా మిలాన్‌ విన్యాసాల్ని ప్రారంభిస్తారు. 
► 27, 28 తేదీల్లో అంతర్జాతీయ మారీటైమ్‌ సెమినార్‌ జరుగుతుంది. ఈ సదస్సులో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డా. ఎస్‌ జయశంకర్‌ హాజరవుతారు.
► 27 సా.4.45కు విశాఖ బీచ్‌రోడ్డులో జరిగే ఆపరేషనల్‌ డిమాన్‌స్ట్రేషన్, ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. 
► ఈ సందర్భంగా యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విశాఖని సీఎం వైఎస్‌ జగన్‌ జాతికి అంకితం చేస్తారు.

షెడ్యూలు, ఏర్పాట్లు ఇలా..
ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ: ఫిబ్రవరి 21
మిలాన్‌–2022 ప్రారంభం: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు
ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌: ఫిబ్రవరి 27 సా.4.45 నుంచి
ముఖ్య అతిథి: సీఎం వైఎస్‌ జగన్‌
పాల్గొనే దేశాలు: సుమారు 46
విదేశీ అతిథులు: 900 మంది
ఆతిథ్యానికి సిద్ధంచేసిన హోటళ్లు: 15
బందోబస్తుకు సిద్ధంచేసిన పోలీస్‌ సిబ్బంది: 5,000
హాజరయ్యే వారు: సుమారు 2 లక్షలు 
కేటాయించిన మొత్తం: రూ.22.27 కోట్లు
తిలకించేందుకు ఏర్పాట్లు: 25 వీడియో సిస్టమ్‌లు, బీచ్‌రోడ్‌లో 3 కిమీ మేర 40 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు
బీచ్‌రోడ్డులో జరిగే కార్యక్రమాలు: గరగల డ్యాన్స్, కూచిపూడి నృత్యాలు తదితర సంప్రదాయ నృత్యాలు
స్టాల్స్‌: ఏటికొప్పాక బొమ్మలు, పొందూరు ఖద్దరుతో పాటు 13 జిల్లాల్లోని ప్రసిద్ధమైన వస్త్రాల స్టాల్స్‌
విదేశీ అతిథులకు తెలుగు రుచులు: ఆంధ్ర పిండి వంటలు, రాయలసీమ రుచులు, కృష్ణా గుంటూరు వంటకాలు. మాడుగుల హల్వా, నాటుకోడి కూర, గుత్తివంకాయ, రాయలసీమ రాగిసంకటి, నెల్లూరు చేపల పులుసు, రొయ్యల వేపుడు, కాకినాడ కాజాలు, బొంగు బిర్యానీ మొదలైనవి.
విదేశీయులకు ఇచ్చే బహుమతులు: ఏటికొప్పాక బొమ్మలు, రాజమండ్రి రత్నం పెన్నులు, ఇతర కళాఖండాలు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement