శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సోమవారం లేఖ రాశారు. రాజ్యాంగం సూచించిన సూత్రాల మేరకు పరిపాలన వ్యవహారాలు సాగాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్ణయించడంతోపాటు ఇతర అంశాలను అధ్యయనం చేసేందుకు శివరామకృష్ణన్ కమిటీని నియమించిందన్నారు. అయితే గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా వారి పార్టీ నాయకులతో కమిటీని వేసి అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రీ–ఆర్గనైజేషన్ యాక్ట్–14 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు.
రాజధాని విషయంలో అధికారికంగా గెజిట్ ద్వారా నోటిఫై చేయలేదని తెలిపారు. రాజ్యాంగ సంస్థలు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో పనిచేయలేదని, వాటిని వేరే చోటుకు మార్చేశారని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సైతం ఒకేచోట పెద్ద పట్టణాన్ని రాజధానిగా ఏర్పాటు చేయడం కంటే వికేంద్రీకరణను సూచించడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాజధాని ఒకేచోట ఏర్పాటు చేయాలనుకున్నా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో ఏర్పాటు చేయవద్దని నిపుణుల కమిటీ స్పష్టంగా పేర్కొన్నా దానిని తుంగలో తొక్కారన్నారు. వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ, మరో ప్రైవేటు సంస్థ ఇచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు. ఇటువంటి నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని ఆయన లేఖలో కోరారు.
అమరావతి రాజధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
Published Tue, Jan 7 2020 4:51 AM | Last Updated on Tue, Jan 7 2020 4:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment