అమరావతి అభివృద్ధే రాష్ట్రాభివృద్ధా? | Implied petitioners report to AP High Court to hear their arguments | Sakshi
Sakshi News home page

అమరావతి అభివృద్ధే రాష్ట్రాభివృద్ధా?

Published Thu, Oct 8 2020 3:08 AM | Last Updated on Thu, Oct 8 2020 3:16 AM

Implied petitioners report to AP High Court to hear their arguments - Sakshi

సాక్షి, అమరావతి: కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి ఎలా అవుతుందని, ఈ విషయంలో చారిత్రక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవాదులు యర్రంరెడ్డి నాగిరెడ్డి, చొక్కారెడ్డి శివారెడ్డి బుధవారం హైకోర్టుకు నివేదించారు. అమరావతి అభివృద్ధిని రాష్ట్రాభివృద్ధిగా చెప్పుకుంటూ పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను వ్యతిరేకించే వారు రాష్ట్రాభివృద్ధి నిరోధకులు అవుతారన్నారు. రాజధాని పేరుతో గత సర్కారు అభివృద్ధిని మొత్తం అమరావతిలోనే కేంద్రీకృతం చేసిందని, దీనివల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ తీవ్రంగా ప్రభావితమయ్యాయని కోర్టుకు నివేదించారు. ఏపీ పునర్విభజన చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ ఉత్తరాంధ్ర, రాయలసీమను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి అభివృద్ధి కోసం పలు సూచనలు, సిఫారసు చేసిందని తెలిపారు.

గత సర్కారుకు ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటుతనం కనిపించలేదని, శివరామకృష్ణన్‌ కమిటీ సూచనలను బుట్ట దాఖలు చేసిందని నివేదించారు. కమిటీ నివేదికను అమలు చేసి ఉంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండేదన్నారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలతో పాటు ఇతర అంశాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఇందులో తమను ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినాలంటూ రాయలసీమకు చెందిన హైకోర్టు న్యాయవాది చొక్కారెడ్డి శివారెడ్డి, శ్రీకాకుళంకు చెందిన న్యాయవాది పీసా జయరాం, మరికొందరు హైకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా శివారెడ్డి, నాగిరెడ్డిలు తమ వాదనలను వినిపించారు.

ఇంప్లీడ్‌ పిటిషనర్ల వాదనలు ఇవీ..
ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు విరుద్ధంగా గత సర్కారు వ్యవహరించింది. సారవంతమైన భూములున్న కృష్ణా–గుంటూరు మధ్య రాజధాని వద్దని చెప్పినందుకే శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను గత ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను అమలు చేయాలని, అమరావతిని రాజధానిగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో గతంలో దాఖలైన పిల్‌ ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది.

సుప్రీంకు గత సర్కారు తప్పుడు అఫిడవిట్‌..
గత సర్కారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తప్పుడు అఫిడవిట్‌ కారణంగా నేడు న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైకోర్టు భవన నిర్మాణం పూర్తైందంటూ ఇచ్చిన తప్పుడు అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు విశ్వసించి హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.తీరా హైకోర్టు విభజన జరిగిన తరువాత విజయవాడలోని ఓ చిన్న భవనంలో హైకోర్టును ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం. 

ఆ తప్పిదాలను ఈ ప్రభుత్వం సరిదిద్దుతోంది...
గత సర్కారు చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం సరిదిద్దే చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను తెచ్చింది. ఒకవేళ వీటిని న్యాయస్థానం కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే రెండు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ప్రభావితమై నష్టపోతారు. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో మమ్మల్ని ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినాలని అభ్యర్థిస్తున్నాం.

మధ్యలో జోక్యం చేసుకోవద్దు..!
విచారణ సందర్భంగా కొందరు న్యాయవాదులు పదే పదే జోక్యం చేసుకుంటుండటంతో.. చేతులు వంచి దండం పెడతామని, ఇలా మధ్యలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, లేదంటే ఈ వ్యాజ్యాల్లో విచారణ ముందుకెళ్లడం సాధ్యం కాదని ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేసింది.

డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌కు నోటీసులు...
అమరావతి కోసం ఇప్పటి వరకు చేసిన వ్యయాల వివరాలను అందచేసేందుకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాన్ని హైకోర్టు అనుమతిస్తూ నోటీసులు జారీ చేసింది. ఓ వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్, పలువురు మంత్రులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. శుక్రవారానికి వాయిదా వేసిన పలు వ్యాజ్యాలపై విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement