ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధానిని నిర్ణయించే విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనల కింద అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను గత తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కిందని న్యాయవాది శివారెడ్డి హైకోర్టుకు నివేదించారు. విజయవాడ–గుంటూరులో రాజధాని వద్దని ఆ కమిటీ చెప్పినప్పటికీ, టీడీపీ సర్కారు మాత్రం ఏకపక్షంగా అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించిందని వివరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కోరలేదన్నారు. రాజధాని కోసం మంచి పంటలు పండే భూములు తీసుకోవద్దని, ప్రభుత్వ భూములను మాత్రమే రాజధాని కోసం వినియోగించాలని అప్పటి ప్రతిపక్ష నేత అసెంబ్లీ వేదికగా నాటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. అవసరం లేకున్నా రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా 34 వేల ఎకరాలను సమీకరించిందని శివారెడ్డి అందులో వివరించారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ కూడా పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలు వినాలంటూ శివారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆది నుంచి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే వస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
రాయలసీమ వాణిని పట్టించుకోలేదు
హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రాంతవాసులు, న్యాయవాదుల ఆందోళనలను గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని ఆయనన్నారు. అప్పటి ప్రభుత్వం హడావుడిగా రాజధానిని, హైకోర్టును అమరావతికి తరలించి, తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలను ప్రారంభించడం చట్ట నిబంధనలకు విరుద్ధమే కాక, ఏకపక్ష నిర్ణయమన్నారు. కేవలం రెండు జిల్లాల అభివృద్ధి కోసం రాష్ట్రాభివృద్ధిని విస్మరించడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం పాలనా వికేంద్రీకరణ బిల్లులను తీసుకొచ్చిందని శివారెడ్డి అందులో వివరించారు. అందులో భాగంగానే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం సంకల్పించిందన్నారు. రాయలసీమ వాసిగా పాలనా వికేంద్రీకరణవల్ల తాను లబ్ధి పొందుతానని.. అందువల్ల ఈ వ్యాజ్యంలో తన వాదనలు వినాల్సిన అవసరముందని ఆయన వివరించారు.
మెమోలు దాఖలు చేసిన కేంద్రం
మరోవైపు.. రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వ్యవహారమే తప్ప, అందులో తమకు ఎటువంటి పాత్ర లేదంటూ తాము దాఖలు చేసిన కౌంటర్‌ను అన్ని వ్యాజ్యాలకు అన్వయింపజేస్తున్నామని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ మెమోలు దాఖలు చేశారు. గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం ఈ మెమోలు దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment