- ఇంటూరి రవికిరణ్‌కు హైకోర్టు వెసులుబాటు
- నిందితుని విజ్ఞప్తిని మేజిస్ట్రేట్ పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడి
- ఆయనపై కేసుల వివరాలు కోర్టు ముందుంచాలని పోలీసులకు ఆదేశం
సాక్షి, అమరావతి : ఏదైనా కేసులో నిందితుడిని పోలీసులు పీటీ వారెంట్ మీద మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినప్పుడు, అతను పోలీసు లేదా జ్యూడిషియల్ కస్టడీని వ్యతిరేకిస్తూ తనకు న్యాయ సాయం అందించాలని మేజిస్ట్రేట్‌ను కోరవచ్చని హైకోర్టు తెలిపింది. అలా కోరే హక్కు నిందితుడికి ఉందని స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్‌లు నిందితుడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడింది. సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌కు హైకోర్టు ఈ వెసులుబాటుని ఇచ్చింది.
రవికిరణ్‌కు సంబంధించి వివరాలేమీ పోలీసులు తమకు తెలియజేయడంలేదని, దీంతో న్యాయ సాయం పొందే అవకాశం లేకుండా పోతోందన్న అతని తరఫు న్యాయవాది వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే రవికిరణ్‌పై నమోదైన కేసుల వివరాలును తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పీటీ వారెంట్ల వివరాలను పోలీసులు నిందితునికి తెలియచేయాల్సిన పని లేదని తెలిపింది.
తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది. తన భర్త రవికిరణ్‌పై ఉన్న కేసుల వివరాలు, పీటీ వారెంట్లపై పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదంటూ ఇంటూరి సుజన హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సుజన తరఫున న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది (హోం) ఎ.జయంతి వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment