
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రేపు(మంగళవారం) తిరుమలకు రానున్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు కూడా తిరుమలను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల, తిరుపతిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రేపు రాష్ట్రపతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా కూడా ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనే సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేయించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
రాష్ట్రపతి తిరుమల పర్యటన వివరాలు...
రేపు(24.11.2020) రాష్ట్రపతి ఉదయం 6గంటలకు రాష్ట్రపతి భవన్ నుంచి బయలుదేరనున్నారు. 6:15 గంటలకు పాలం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి 9:15 గంటలకు చెన్నై విమానాశ్రయం చేరుకోనున్నారు. 10:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి 11 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత 12:15 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహంలో దిగుతారు. తర్వాత 12:50 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహంలో విడిది చేసి అక్కడి నుంచి వరాహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. 1:05 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం రాష్ట్రపతి 1: 40 గంటలకు తిరిగి పద్మావతి అతిధి గృహం చేరుకోనున్నారు. ఇక మధ్యాహ్నం భోజనం తర్వాత విరామం తీసుకున్న అనంతరం 3:40 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారు.