సంక్రాంతి కానుక అందిస్తున్న వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సాక్షి, చంద్రగిరి (తిరుపతి): తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ విప్, తిరుపతి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంక్రాంతి కానుకను అందించారు. నియోజకవర్గంలో మొత్తం 1.60 లక్షల కుటుంబాలకు సంక్రాంతిని పురస్కరించుకుని సోమవారం దుస్తులు పంపిణీ చేశారు. చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని నారాయణి గార్డెన్స్‌లో ఇంటింటికీ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి చంద్రగిరిలో కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా కానుకలు పంపిస్తూ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తన నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తయారు చేస్తూ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే చెవిరెడ్డికి భగవంతుని ఆశీస్సులు నిత్యం కలగాలని ఆకాంక్షించారు. ఆపద వచ్చినా, ఆనందం కలిగినా తన నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లాంటి ఎమ్మెల్యే దొరకడం చంద్రగిరి ప్రజల అదృష్టమని సుబ్బారెడ్డి ప్రశంసించారు.
తన కుటుంబ సభ్యుల కంటే గొప్పగా నియోజకవర్గ ప్రజలను ప్రేమించడం ఆయనకు మాత్రమే సాధ్యమన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పండుగ జరుపుకోలేని పేదలకు అన్నీ తానై సంతోషాన్ని పంచే చెవిరెడ్డి ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో శానిటైజర్లు, మాస్‌్కలు, పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు, విటమిన్ టాబ్లెట్లు, మల్టీవిటమిన్ సిరప్‌లు, హోమియో మందులు, ఆయుర్వేద మందులు, ఆనందయ్య మందు, యోగా, ప్రాణాయామం పుస్తకాలు, ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారు.
అదే ఆత్మసంతృప్తి: చెవిరెడ్డి
నా సంపాదనలో 70 శాతం చంద్రగిరి నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నాను.. అదే నాకు ఆత్మ సంతృప్తి కలిగిస్తోంది అని చెవిరెడ్డి పేర్కొన్నారు. కష్టాలు వచ్చినపుడు మాత్రమే కాదు ఆనందంలో కూడా భాగస్వామిని కావాలని కానుకలు పంపుతున్నానని వెల్లడించారు. కులమతాలు, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరికీ మంచి చేయాలన్న ముఖ్యమంత్రి జగనన్న స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరికీ కానుకలు అందిస్తున్నట్లు చెవిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment