
పద్మావతీ అమ్మవారికి పట్టువస్త్రాలు, శ్రీవారి సారెను తీసుకెళ్తున్న నారాయణస్వామి, వైవీ సుబ్బారెడ్డి. చిత్రంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుచానూరు (చిత్తూరు జిల్లా): తిరుచానూరులో పంచమితీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీ పద్మావతీ అమ్మవారికి ఆదివారం బంగారు ఆభరణం సమర్పించారు. రూ.7 లక్షలు విలువైన 113 గ్రాములు బరువు ఉన్న అన్‌కట్ డైమండ్ నెక్లెస్‌ను సీఎం తరఫున టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆలయ అధికారులకు అందజేశారు.
పట్టువస్త్రాలు సమర్పించిన నారాయణస్వామి..
తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి జేఈవో బసంత్‌కుమార్, తుడా చైర్మన్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం నారాయణస్వామికి ప్రసాదాలు అందజేశారు. ఈ అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు నారాయణస్వామి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో విశేషమైన పంచమి తీర్థం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏటా పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారని చెప్పారు. అలాగే తిరుచానూరులో ఆదివారం జరిగిన పంచమితీర్థానికి (చక్రస్నానం) భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పుణ్యస్నానమాచరించారు. ఆదివారం రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించారు. అనంతరం రాత్రి 9.30 నుంచి 10.30 వరకు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment