రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలో పురాతన ఆలయాల పునరుద్ధరణతో పాటు కొత్త ఆలయాల నిర్మాణానికి టీటీడీ తరపు నుంచి అన్నివిధాలుగా సాయం అందించేందు ముందుకు రావడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకుగానూ సీఎం జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
బుధవారం జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌తో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నారు
తిరుమల తిరుపతి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆలయం. ఆ దేవుడి దయతో జగన్‌రెడ్డన్న ఏపీ సీఎంగా, వైవీ సుబ్బారెడ్డన్న టీటీడీకి చైర్మన్ కొనసాగుతున్నారు. అలాగే తెలంగాణాలో పురాతన, ప్రశస్తి.. ప్రభ కలిగిన దేవాలయాలు చాలానే ఉన్నాయి. కొన్ని డబ్బులు ఇస్తే అవి కూడా వెలుగుతాయని అడిగాం. అడిగిన వెంటనే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నారు. డబ్బులు ఇవ్వడంతో పాటు కార్యక్రమానికి ఇవాళ వైవీ సుబ్బారెడ్డన్న వచ్చారు. మరోమాట లేకుండా సాయం అందించేందుకు ఒప్పుకున్న జగనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ కేటీఆర్ కృతజ‍్క్షతలు తెలియజేశారు. అలాగే.. వేణుగోపాలస్వామి ఆలయానికి ఇంకో 80 లక్షల రూపాయలు కావాలని అడగ్గానే క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పకున్న సుబ్బారెడ్డన్న గొప్ప మనసుకు ధన్యవాదాలు. గంభీరావుపేట సీతారామస్వామి ఆలయ పునర్నిర్మాణానికి కూడా నేను చెప్పగానే ఆలోచిస్తాన్నామన్నందుకూ ధన్యవాదాలు అని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ అడిగారు.. మేం చేశాం
దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా.. కొత్త దేవాలయాలను నిర్మించడం, పాత ఆలయాలను పునర్మించే కార్యక్రమం సీఎం జగన్‌గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున గత నాలుగేళ్లుగా కొనసాగుతోందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బలహీన వర్గాలు, మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున్న దేవాలయాలు నిర్మిస్తున్నాం. కరీంనగర్‌లో ఆలయ పనులకు శంకుస్థాపన జరిగి.. పనులు ప్రారంభించాం. సిరిసిల్ల పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం పనులకు 2 కోట్లు.. వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ. 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏ మేరకు నిధులు కావాలన్నా టీటీడీ నుంచి నిధులు ఇస్తామని మాటిస్తున్నాం అని అన్నారాయన. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ.. సోదరుల్లాగా ఉందామని, తెలుగు ప్రజల ఇల వేల్పు కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో సుఖంగా, సంతోషంగా ఉందామని కోరుకుంటున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment