
సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 20 నుంచి రెండ్రోజుల పాటు విశాఖలో ఆయన పర్యటిస్తారు. 20న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖ చేరుకుంటారు. అనంతరం నేవల్ ఎయిర్ స్టేషన్‌కు చేరుకుని ప్రెసిడెన్షియల్ సూట్ (చోళా సూట్)కి వెళ్తారు. అక్కడ రాష్ట్రపతి రాత్రి బస చేస్తారు. 21న ఉదయం నేవల్ డాక్‌యార్డుకు చేరుకుని ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. మధ్యాహ్నం పీఎఫ్‌ఆర్ గ్రూప్ ఫొటో కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.45గంటల వరకు రాష్ట్రపతి విందులో పాల్గొంటారు. 22వ తేదీ ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు.
పీఎఫ్‌ఆర్, మిలాన్‌లకు భారీ భద్రత
విశాఖ వేదికగా జరగనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్‌ఆర్), మిలాన్–2022 కార్యక్రమాలకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లుచేస్తున్నారు. దీనిపై ఆదివారం నగర పోలీస్ కమిషనరేట్‌లో డీజీపీ గౌతమ్ సవాంగ్ అధ్యక్షతన నేవీ ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులతో పాటు ప్రముఖులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు, నిర్వాహణపై డీజీపీ చర్చించారు. ఈరెండు కార్యక్రమాలకు ఎటువంటి అవరోధాలు లేకుండా విజయవంతం చేయాలని సూచించారు.