సాక్షి, హైదరాబాద్ : వ్యక్తిగత, సామాజిక పరివర్తనకు రామచంద్ర మిషన్ కృషి చేస్తోందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని రామచంద్ర మిషన్ 75 వ వార్షికోత్సవ ఉత్సవాలకు రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం హాజరయ్యారు. కాన్హా శాంతివనంలోని ధ్యాన కేంద్రాన్ని ఆయన హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ గ్లోబల్ హెడ్ క్వార్టర్‌గా ప్రకటించారు.
దాదాపు 1,400 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాన్హా శాంతివనాన్ని రాష్ట్రపతి గతంలో ఒకసారి సందర్శించారు. ప్రపంచంలోని 130 దేశాల్లో విస్తరించి ఉన్న కాన్హా ఆశ్రమానికి సంబంధించి అయిదు వేలకు పైగా ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అన్నింటికన్నా మిన్నగా నిర్మించిన కాన్హా శాంతివనాన్ని గ్లోబల్ హెడ్ క్వార్టర్‌గా రాష్ట్రపతి ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరంగా పేరుపొందిన దీనిలో ఒకేసారి లక్షమంది ధ్యానం చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్, గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, దత్తాత్రేయను రామచంద్ర మిషన్ చైర్మన్ దాజీ కమలేష్ పటేల్ ఘనంగా సన్మానించారు.
కాగా ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి దంపతులు హెలికాప్టర్ ద్వారా కాన్హా ఆశ్రమానికి చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు ఆయన కాన్హాలో గడిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, మహబూబ్ నగర్ కలెక్టర్ రొనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment