సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి) ఆర్థిక నేరాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి సెప్టెంబర్ 26న రాసిన లేఖ పట్ల రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ స్పందించారు. ఈ లేఖ రాష్ట్రపతి సచివాలయం నుంచి నవంబర్ 6న కేంద్ర హోం శాఖకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ విజయసాయిరెడ్డి రాసిన లేఖను, రాష్ట్రపతి కార్యాలయం నోట్‌తో వచి్చన లేఖను కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శికి, కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శికి పంపింది. తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరింది. ఈ మేరకు హోంశాఖ అండర్ సెక్రెటరీ అశోక్ కుమార్ పాల్ విజయసాయిరెడ్డికి ఒక లేఖ పంపారు. దీంతో సుజనా చౌదరి అక్రమాలపై సంబంధిత శాఖలు విచారణకు సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుజనా చౌదరి అంతర్జాతీయ స్కామ్‌స్టర్, మానీలాండరర్, మోసపూరిత కంపెనీలను సృష్టించడంలో ఆరితేరిన వ్యక్తి అని విజయసాయిరెడ్డి తన లేఖలో ఆరోపించారు. సుజనా చౌదరిపై ఉన్న ఆరోపణలను రాష్ట్రపతికి రాసిన లేఖలో వి.విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.
సుజనా చౌదరి మోసాలివీ...
►సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా టవర్స్‌తోపాటు మరో 102 కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఒకటైన బార్ర్‌టోనిక్స్ పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీ. 8 కంపెనీలు తప్ప మిగిలినవన్నీ షెల్(డొల్ల) కంపెనీలే. ఇవి సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్డింగ్, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలతో సంబంధం ఉన్నవి.
►ఈ 8 కంపెనీల్లో 50 శాతం వ్యాపారం భారత్‌లోని షెల్ కంపెనీల ద్వారా జరుగుతున్నదే. మరో 20–25 శాతం వ్యాపారం సుజనా గ్రూపు పరోక్షంగా నిర్వహిస్తున్న విదేశీ షెల్ కంపెనీల ద్వారా జరుగుతోంది.
►సుజనా గ్రూపు ప్రస్తుతం వివిధ బ్యాంకులు, ఆరి్థక సంస్థలకు రూ.8 వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉండగా, మార్కెట్‌లో ఆ గ్రూపు ఆస్తుల విలువ రూ.132 కోట్లు కూడా లేదు. ఫలితంగా ఈ గ్రూపు కంపెనీల షేర్లు కొన్నవారు భారీగా నష్టపోయారు.
►సుజనా గ్రూపునకు చెందిన బిగ్ బ్రదర్స్‌గా పిలిచే రెండు ప్రధాన కంపెనీలు (సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, సుజనా టవర్స్) కలిపి రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు(సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా) రూ.920 కోట్లు మేర రుణాలు ఎగవేశాయి.
►ఈ రెండు కంపెనీలతోపాటు సుజనా గ్రూపు నడుపుతున్న మరో పెద్ద సంస్థ సుజనా మెటల్ ప్రొడక్టŠస్. ఈ సంస్థ 2014 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.38 కోట్ల నష్టాన్ని చూపగా, సుజనా యూనివర్సల్ రూ.6.3 కోట్ల నష్టాన్ని చూపింది. సుజనా టవర్స్ మాత్రం రూ.1.8 కోట్ల స్వల్ప నికర లాభం చూపింది.
►2011–2014 ఆరి్థక సంవత్సరాల మధ్య సుజనా టవర్స్ రుణ భారం రూ.565 కోట్ల నుంచి రూ.1,750 కోట్లకు చేరినట్టుగా పుస్తకాల్లో చూపారు. అదే సమయంలో మార్కెట్ కాపిటలైజేషన్ రూ.1,534 కోట్ల నుంచి రూ.37 కోట్లకు తరిగిపోయింది.
సింగపూర్ కేంద్రంగా అవినీతి బాగోతం
సుజనా చౌదరికి చెందిన గ్రూపు ప్రస్తుతం సింగపూర్ కేంద్రంగా ‘ఇంట్రాసియా’ పేరుతో అంతర్జాతీయ కంపెనీల గ్రూపును నిర్వహిస్తోంది. ఈ గ్రూపు కింద బిస్ట్రోలియా అసియా, మ్యాగ్నమ్ ఎంటర్‌ప్రైజస్, సన్ ట్రేడింగ్ లిమిటెడ్, మైక్రోపార్ట్ ఇంటర్నేషనల్, బీజింగ్ గ్రేట్ ఫారŠూచ్యన్ ఇంటర్నేషనల్, రోడియం రీసోర్సస్, పీఏసీ వెంచర్స్ పీటీఈ లిమిటెడ్, ఏపీఐఈఎస్ వెంచర్స్ పీటీఈ లిమిటెడ్, స్కైవెల్ గ్రూప్, పోలిలక్స్ ఇంటర్నేషనల్, మాంటన్ రిసోర్సస్ పీటీఈ లిమిటెడ్, ట్రయంప్ అగ్రి పీటీఈ లిమిటెడ్, అగ్రిట్రేడ్ ఇంటర్నేషనల్ పీటీఈ లిమిటెడ్, దీప్ పోకెట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో పలు కంపెనీలను నిర్వహిస్తున్నారు.
ఈ కంపెనీలను కేవలం రికార్డుల్లో చూపిస్తూ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, అనంతరం సుజనా చౌదరికి చెందిన ఇతర కంపెనీలకు నిధులు మళ్లించడమే లక్ష్యంగా వ్యవహారాలు సాగించారు. అందుకోసం సింగపూర్ కేంద్రంగా పక్కా పన్నాగం అమలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార లావాదేవీలు సాగించినట్లు రికార్డుల్లో చూపించాయి. అనంతరం ఆ కంపెనీలన్నీ తమ వ్యాపారాలను బీమా చేయించుకున్నాయి. ఈ బీమాను చూపించి అంతర్జాతీయ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందాయి. అనంతరం ఆ నిధులను సుజనా చౌదరి వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారు. అలా అటు అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలను, ఇటు అంతర్జాతీయ బ్యాంకులను సుజనా చౌదరి మోసగించారు.
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణం
సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన హెస్టియా హోల్డిండ్ లిమిటెడ్, నువాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థలు మారిషస్ కమర్షియల్ బ్యాంకుల నుంచి రూ.107 కోట్ల రుణం తీసుకుని.. తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేశాయి. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు పిటిషన్ దాఖలు చేసింది.
►సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన నువాన్స్ హోల్డింగ్స్‌తో(హాంకాంగ్) సంబంధం ఉన్న సెలెన్ హోల్డింగ్స్ ఏఎఫ్‌ఆర్ ఆసియా బ్యాంకు నుంచి 5 మిలియన్ డాలర్లును 2011న జూలైలో రుణంగా తీసుకుంది. ఆ తర్వాత స్టాండర్డ్ బ్యాంక్–మారిషస్ నుంచి 12 మిలియన్ డాలర్ల
రుణం తీసుకుంది.
►బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టŠస్ లిమిటెడ్ పేరుతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.304 కోట్ల రుణం తీసుకోవడానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సుజానా గ్రూపు సమర్చించడంపై సీబీఐకి ఆ బ్యాంకు తాజాగా ఫిర్యాదు చేసింది.
►సుజనా గ్రూపు సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ఇన్‌కమ్ ట్యాక్సుల రూపంలో రూ.962 కోట్లు చెల్లించకుండా ఎగ్గొట్టడంపై కేసుల విచారణ వివిధ దశల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment