Arjun Ram meghaval
-
రామ్‌నాథ్ కోవింద్ కమిటీ మొదటి సమావేశంలో కీలకాంశాలు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాసంలో జమిలీ ఎన్నికలపై జరుగుతున్న తొలి సమావేశం సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి ఇతర నేతలు హాజరయ్యారు. 'వన్ నేషన్ వన్ ఎలెక్షన్'పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు మొదటిసరి అధికారికంగా సమావేశమయ్యింది. ఈ హైలెవెల్ కమిటీ సమావేశంలో ఏడు కీలక అంశాలపై చర్చించి సిఫారసులు చేయనుంది. రాజ్యాంగ సవరణలు: ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. అందుకు ఏయే రాజ్యాంగ అధికారణల సవరణలు చెయ్యాలో, ఏయే చట్టాల సవరణ చెయ్యాలో కమిటీ అధ్యయనం చేస్తుంది. రాష్ట్రాల అనుమతి: ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే వాటి సవరణకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? లేక కేంద్రమే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళవచ్చా అన్నదానిపై కూడా స్పష్టతనివ్వాలి. సంకీర్ణాలైతే : ఇక ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా అధ్యయనం చేసి హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై కూడా ఈ కమిటీ సూచనలు తెలియజేయాలి. సాధ్యం కాకపోతే: ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కమిటీ పూర్తి వివరాలను తెలియజేయాలి. భవిష్యత్తు : ఒకసారి పరిస్థితులు అనుకూలించి ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, మళ్లీ ఇది దెబ్బ తినకుండా తదనంతరం కూడా కొనసాగడానికి అవసరమైన చర్యలపై కూడా సిఫారసులు చెయ్యాలి. సిబ్బంది: ఒకేసారి ఎన్నికలకు ఈవీఎంలు, వివి ప్యాట్ల అవసరం ఎంత? వాటితో పాటు మానవ వనరుల అవసరమెంతో కూడా స్పష్టమైన నివేదిక సమర్పించాలి. ఒక్కటే ఓటర్ కార్డు: లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు తీసుకునే అంశమై ఎటువంటి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలో తెలియజేయాలి. ఇది కూడా చదవండి: ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్ -
కోవిడ్‌పై పోరులో కీలకం స్వచ్ఛభారత్: మోదీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో స్వచ్ఛభారత్ కార్యక్రమం చాలా ముఖ్యమైందని ప్రధాని మోదీ అన్నారు. శనివారం ఆయన స్వచ్ఛభారత్ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రాన్ని ప్రారంభించి కార్యక్రమానికి హాజరైన విద్యార్థులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈనెల 15వ తేదీ వరకు కొనసాగే ‘వ్యర్థ విముక్త భారత్’ కార్యక్రమం ద్వారా వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత ప్రాధాన్యాన్ని చాటిచెప్పిన మహాత్మాగాంధీకి నివాళిగా రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రంను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గాంధీజీ చేపట్టిన చంపారన్ సత్యాగ్రహం కార్యక్రమం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ 2017లో ప్రకటించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ఆగస్టు 8వ తేదీని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో టాయిలెట్లు నిర్మించాలని, అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని ఆయన జిల్లాల అధికారులను కోరారు. కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు భౌతిక దూరం నిబంధనలను పాటించాలనీ, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విద్యార్థులను ప్రధాని కోరారు. తగ్గిన మరణాలు.. పెరిగిన రికవరీ న్యూఢిల్లీ: భారత్‌లో వరుసగా రెండో రోజూ 60 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. శనివారం కొత్తగా 61,537 కేసులు బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 20,88,611కు చేరుకుంది. గత 24 గంటల్లో 48,900 కోలుకోగా, 933 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 42,518కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,27,005కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,19,088 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 29.64గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 68.32 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2.04%కి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 7 వరక 2,33,87,171 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం మరో 5,98,778 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. కేంద్రమంత్రి మేఘ్వాల్కు పాజిటివ్ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్–19 పరీక్షలో పాజిటివ్ వచ్చిందని, ఎయిమ్స్‌లో చేరానని ఆయన శనివారం వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాని కోరారు. -
బీఎస్ఎన్ఎల్కు ఆర్ధిక ప్యాకేజీ!
కోచి: నిధుల్లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కు ప్రభుత్వం ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి అర్జున్ రామ్మేఘ్వాల్ తెలిపారు. భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థల శాఖా మంత్రి అయిన ఆయన సోమవారం కోచి వచి్చన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీఎస్ఎన్ఎల్కు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని, అదే ప్రభుత్వం ముందున్న అత్యంత ప్రాధాన్య అంశమని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం నుంచి బీఎస్ఎన్ఎల్కు ఆర్థిక సహకారం అవసరం ఉంది. బీఎస్ఎన్ఎల్ను ప్రోత్సహించాలని మేం కోరుకుంటున్నాం. ప్రభుత్వం ముందున్న అధిక ప్రాధాన్యం ఇదే’’ అని మంత్రి పేర్కొన్నారు. -
దక్షిణాది ఇరిగేషన్ మంత్రుల భేటీ
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ శాఖల మంత్రుల సమావేశం ఈనెల 20న హైదరాబాద్‌లో జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి అర్జున్‌రాం మేఘవాల్ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు పాల్గొననున్నారు. ఇందులో ప్రధానంగా గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటకల్లోని కావేరి వరకు అనుసంధానం చేపట్టాలని కేంద్రం తొలుత నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు భిన్నంగా కొత్త ప్రత్యామ్నాయాన్ని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తెరపైకి తెచ్చింది. తెలంగాణలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందనీ, దీనికి ప్రత్యామ్నాయంగా గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని కేంద్రం సూచిస్తోంది. అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరికి తరలించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇదివరకే కేంద్రం ఓమారు సమావేశం నిర్వహించగా, నీటి లభ్యత, ముంపు తదితర అంశాలపై అనేక అనుమానాలు లేవనెత్తింది. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరీ అనుసంధానం చేపట్టాలని కోరింది. అయితే దీనిపై మరింత అధ్యయనం, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్న కేంద్రం 20న దక్షిణాది రాష్ట్రాలతో భేటీ ఏర్పాటు చేసింది. -
గోధుమ, కందిపప్పు దిగుమతిపై 10% పన్ను
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి అయ్యే గోధుమ, కందిపప్పులపై 10 శాతం పన్ను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఈ రెండు పంటల దిగుబడి ఈ ఏడాది భారీగా ఉండనుం దనే అంచనాల నడుమ..ఒక్కసారిగా ధరలు పడిపోయి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్‌సభలో చెప్పారు. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అంగీకరించే విధంగా దివ్యాంగుల కోసం ఓ ప్రత్యేక గుర్తింపు కార్డును తీసుకొస్తామని సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ లోక్‌సభకు తెలిపారు. ఒకే గుర్తింపు కార్డుతో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ వారికోసం అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను పొందడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. ► దేశంలోని మొత్తం శత్రు ఆస్తుల విలువ రూ.1.04 లక్షల కోట్లని హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ లోక్‌సభలో వెల్లడించారు. అలాగే మరో ప్రశ్న కు బదులిస్తూ ఢిల్లీలోని ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లలో గత మూడేళ్లలో 73 చోరీ కేసులు నమోదయ్యాయని హన్స్‌రాజ్ తెలిపారు. కాషాయం దుస్తుల్లో స్పీకర్ గుడీ పడ్వా పర్వదినం సందర్భంగా స్పీకర్ సుమిత్ర మహాజన్ మంగళవారం లోక్‌సభకు కాషాయ దుస్తుల్లో హాజరవడంతో ఓ మహారాష్ట్ర ఎంపీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మేడమ్, నా సొంత రాష్ట్రంలో పండుగను జరుపుకోలేక పోతున్నందుకు నేను కాస్త అసంతృప్తితో ఉన్నాను. పండుగ రోజున కాషాయం రంగు దుస్తులు ధరించినందుకు మీకు ధన్యవాదాలు’అని ముంబై–ఉత్తర నియోజకవర్గ ఎంపీ గోపాల్ చినయ్య శెట్టి అన్నారు. దీంతో సభలో నవ్వుల పువ్వులు విరిశాయి. -
ప్రత్యేక హోదాపై త్వరలో ప్రకటన
-కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి విజయవాడ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ అన్న అంశంపై కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్రామ్మేఘవాల్ అన్నారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా మంగళవారం నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖామాత్యులు కామినేని శ్రీనివాస్ దుర్గాఘాట్‌లోని వీఐపీ ఘాట్‌కు తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి కృష్ణానదికి నమస్కరించి నదిలోని నీటిని తలకు రాసుకున్నారు. అనంతరం భక్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవిత్ర కృష్ణానది పుష్కరాల వేళ విజయవాడకు రావటం మధురానుభూతిగా మిగిలిపోతుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించి రావాలని మంత్రులందరినీ ఆదేశించారన్నారు. ఆయన ఆదేశాలతో నెల్లూరు వెళ్తూ ఇక్కడకు వచ్చానని చెప్పారు. పుష్కరాలు భారతీయ ఔన్నత్యాన్ని చాటే గొప్ప కార్యక్రమామన్నారు. పుష్కరాలకు మంచి ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. అనంతరం ప్రత్యేక హోదాపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ దీనిపై ఇటీవల రెండు సభల్లోనూ సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. సభల నిర్ణయాలను తమ శాఖ అమలు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన రాష్ట్రమన్నారు. దీనికి అన్ని విధాల సాయమందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రత్యేకహోదా అంశంపై కేంద్రం పూర్తిస్తాయిలో కసరత్తు చేస్తుందన్నారు. కేవలం కొద్ది రోజుల్లోనే హోదా లేదా ప్యాకేజీ అనే అంశాలను ప్రకటిస్తామని వివరించారు. రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పుష్కరాల్లో అన్ని శాఖలు సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా తమ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం జరిగిన సంఘటనల్లో చక్కగా స్పందించి వైద్య సేవలందించిందన్నారు.