-కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి
విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ అన్న అంశంపై కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌మేఘవాల్ అన్నారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా మంగళవారం నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖామాత్యులు కామినేని శ్రీనివాస్ దుర్గాఘాట్‌లోని వీఐపీ ఘాట్‌కు తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి కృష్ణానదికి నమస్కరించి నదిలోని నీటిని తలకు రాసుకున్నారు. అనంతరం భక్తులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవిత్ర కృష్ణానది పుష్కరాల వేళ విజయవాడకు రావటం మధురానుభూతిగా మిగిలిపోతుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించి రావాలని మంత్రులందరినీ ఆదేశించారన్నారు. ఆయన ఆదేశాలతో నెల్లూరు వెళ్తూ ఇక్కడకు వచ్చానని చెప్పారు. పుష్కరాలు భారతీయ ఔన్నత్యాన్ని చాటే గొప్ప కార్యక్రమామన్నారు. పుష్కరాలకు మంచి ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు.
అనంతరం ప్రత్యేక హోదాపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ దీనిపై ఇటీవల రెండు సభల్లోనూ సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. సభల నిర్ణయాలను తమ శాఖ అమలు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన రాష్ట్రమన్నారు. దీనికి అన్ని విధాల సాయమందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రత్యేకహోదా అంశంపై కేంద్రం పూర్తిస్తాయిలో కసరత్తు చేస్తుందన్నారు. కేవలం కొద్ది రోజుల్లోనే హోదా లేదా ప్యాకేజీ అనే అంశాలను ప్రకటిస్తామని వివరించారు. రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పుష్కరాల్లో అన్ని శాఖలు సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా తమ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం జరిగిన సంఘటనల్లో చక్కగా స్పందించి వైద్య సేవలందించిందన్నారు.