![Uttar Pradesh village has IAS or PCS officer in each house - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/17/john-p.jpg.webp?itok=1VcywS_P)
ఉత్తరప్రదేశ్‌లోని మారుమూల గ్రామం మేథోపట్టి. కేవలం 75 ఇళ్లు ఉండే ఈ ఊరు విద్యుత్, రోడ్లు వంటి సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉంది. అనారోగ్యంపాలైతే గ్రామస్తులు చికిత్స కోసం 10 కి.మీ దూరంలో ఉన్న ఆసుపత్రికి పరుగుతీయాల్సిందే. అదంతా నాణేనికి ఓవైపు. మరోవైపు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ పరీక్షలో ఈ గ్రామస్తులు ర్యాంకులు కొల్లగొడుతున్నారు. ఈ ఊరు నుంచి ఇప్పటిదాకా ఏకంగా 47 మంది ఐఏఎస్ అధికారులుగా ఎంపికయ్యారు.
ఒకే ఇంటి నుంచి నలుగురు ఐఏఎస్ అధికారులవ్వడం విశేషం. బ్రిటిష్ ఇండియాలో 1914లో ఖాన్ బహద్దూర్ సయ్యద్ మొహమ్మద్ ముస్తఫా ఖాన్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఊరు నుంచి ఐఏఎస్ అయ్యారు. 1952లో ఇందు ప్రకాశ్ అనే వ్యక్తి ఈ ఊరి నుంచి రెండో ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి ఈ గ్రామ యువకుల జైత్రయాత్ర కొనసాగుతోంది. 1955లో మేథోపట్టి నుంచి వినయ్ కుమార్ ఐఏఎస్‌గా ఎంపికై బిహార్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి హోదాలో పదవీవిరమణ చేశారు.
ఆయన తర్వాత ముగ్గురు తమ్ముళ్లు ఛత్రపతిపాల్, అజయ్, శశికాంత్‌లు ఐఏఎస్ అధికారులుగా నియమితులయ్యారు. ఈ విషయమై స్థానికంగా టీచర్‌గా పనిచేస్తున్న కార్తికేయ సింగ్ మాట్లాడుతూ..‘జోన్‌పూర్‌లోని డిగ్రీ కళాశాలే వీరిలో పోటీతత్వాన్ని నింపింది. ఇక్కడ సివిల్స్ కోసం కోచింగ్ తీసుకున్నవారు చాలా అరుదు. సివిల్స్ అనగానే ఇప్పుడంతా ఇంగ్లిష్ మీడియంవైపు పరుగులు పెడుతున్నారు. కానీ ఊరిలో సివిల్స్‌కు ఎంపికైన వారంతా హిందీ మీడియంలో చదువుకున్నవారే’ అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment