సంతోష్
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు గరిక సంతోష్ కుమార్. రెండేళ్ల క్రితం యూపీఎస్సీ పరీక్షల్లో ర్యాంకు సాధించాడు. కేసు పెండింగ్‌లో ఉండటంతో ఎంపిక ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా ఆ కేసు ముగించుకునే మార్గాలు అన్వేషిస్తారు. సంతోష్ మాత్రం దీనికి పూర్తి ‘భిన్నం’. మసాజ్ సెంటర్ నిర్వాహకుడిగా మారి మరో కేసును తనపై వేసుకున్నాడు. ‘క్రాస్ మసాజ్’లు నిర్వహిస్తున్న ఆరోపణలపై సంతోష్ సహా ఏడుగురు నిందితుల్ని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు సోమవారం వెల్లడించారు.
విశాఖపట్నానికి చెందిన సంతోష్ కుమార్ ఫిజిక్స్ విభాగంలో ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. సివిల్స్ కోచింగ్ కోసం సిటీకి వచ్చి అశోక్‌నగర్ చౌరస్తాలో ఉన్న ఓ ఇన్‌స్టిట్యూట్‌లో దాదాపు ఏడాది కోచింగ్ తీసుకున్నాడు. ఆ సమయంలోనే వైఎంసీఏ చౌరస్తాలోని స్లా్పష్ సెలూన్‌లో భాగస్వామిగా చేరాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మరో భాగస్వామితో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో అతడి భార్యపై దాడి చేశాడనే ఆరోపణలతో సంతోష్‌పై నారాయణగూడ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు అయి, బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఇది కోర్టు విచారణ దశలో ఉంది.
ఇదిలా ఉండగా 2016లో సివిల్స్ రాసిన సంతోష్ తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు విజయవంతంగా పూర్తి చేసి ర్యాంకు సాధించాడు. అయితే నారాయణగూడలో క్రిమినల్ కేసు నమోదై ఉండడంతో ఎంపిక ప్రక్రియకు బ్రేక్ వేసిన యూపీఎస్సీ సంతోష్ పేరును విత్‌హెల్డ్‌లో పెట్టింది. మరోపక్క ఆ సెలూన్‌ను సంతోష్ బంధువైన రాధారెడ్డి స్పాగా మార్చారు. మగవారికి ఆడవారితో మసాజ్‌లు చేయించడం (క్రాస్ మసాజ్) చట్ట విరుద్ధమైనప్పటికీ అలా చేస్తూ మూడుసార్లు పోలీసులకు చిక్కారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరు నెలల క్రితం ‘స్పా’ బాధ్యతలు చేపట్టిన సంతోష్ క్రాస్ మసాజ్‌ల పరంపరను కొనసాగించాడు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతుల్ని ఉద్యోగినులుగా నియమించుకున్నాడు. వీరితో కస్టమర్లకు మసాజ్‌లు చేయిస్తూ భారీగా వసూలు చేస్తున్నాడు. ఈ ఉద్యోగినులకు కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడు. కస్టమర్లకు మసాజ్ చేసిన సందర్భంలో వారిచ్చిన టిప్పులతోనే ఈ యువతులు బతుకీడుస్తున్నారు.
స్లా్పష్ స్పా వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు జి.తిమ్మప్ప తమ బృందంతో సోమవారం స్పాపై దాడి చేశారు. సంతోష్‌తో పాటు రిసెప్షనిస్ట్ వై.శ్రీకాంత్, కస్టమర్లు ఎల్.గోపినాథ్, కె.కుమార్, మసాజ్ చేసే యువతులను అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, సెల్‌ఫోన్లు తదిరాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో తాను సివిల్స్ ర్యాంకర్ అని, కేసుతో ఎంపికకు బ్రేక్ పడిందని సంతోష్ చెప్పడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. రికార్డులు పరిశీలించిన అధికారులు అతడు చెప్పింది నిజమేనని ధ్రువీకరించారు. తదుపరి చర్యల నిమిత్తం సంతోష్ సహా నిందితుల్ని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. దీంతో కలిపి అదే ఠాణాలో సంతోష్‌పై రెండు కేసులు ఉన్నట్‌లైంది.
Comments
Please login to add a commentAdd a comment