
చీత్కారాలే కసిని పెంచాయి
► నన్నెందుకూ పనికి రావన్నారు
► కోచింగ్ సెంటర్‌లలో అడ్మిషన్ కూడా ఇవ్వలేదు
► పట్టుదలతో చదివాను... మూడో ర్యాంకు సాధించాను
► ‘సాక్షి’మెటీరియల్ ఎంతో ఉపయోగపడిందన్న గోపాలకృష్ణ
హైదరాబాద్: సివిల్స్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబ. తల్లిదండ్రులు రోణంకి అప్పారావు, రుక్మిణి వ్యవసాయ కూలీలు. అన్నయ్య కోదండరావు ఎస్‌బీఐలో మేనేజర్. పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకూ తెలుగు మీడియంలోనే పలాస మండంలో చదివారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ(ఎంపీసీ)లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్లలోని డైట్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 2007లో డీఎస్సీ రాసి సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)గా ఎంపికయ్యారు.
ప్రస్తుతం పలాస మండలం రేగులపాడులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 2012లో గ్రూప్–1లో ఇంటర్వూ్య వరకు వెళ్లినా సుప్రీంకోర్టు తీర్పుతో ఇంటర్వూ్యలు రద్దయ్యాయి. ఒకవైపు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు 2006 నుండి సివిల్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. చివరికి నాలుగో ప్రయత్నంలో తన కల సాకారం చేసుకున్నాడు. 1వ తరగతి నుండి సివిల్స్ వరకు మాతృభాష తెలుగులో చదివి ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకు సాధించడం ఇదొక చరిత్ర అని సివిల్స్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇరుకు గది.. గది నిండా పుస్తకాలు..
అశోక్‌నగర్ చౌరస్తాలోని ఓ మారుమూల గల్లీ. రూ.3,500 కిరాయితో సింగిల్ రూం. ఆరు నెలలుగా ఇదే గోపాలకృష్ణ చిరునామా. ఓ వాలు కుర్చీ, 4 ప్యాంట్లు, చొక్కాలు, ఓ ఎలక్ట్రి కల్ కుక్కర్ ఇవే అందులోని వస్తువులు. గది లో ఎక్కడ చూసినా పుస్తకాలే కనిపిస్తాయి. ఎప్పుడైనా అనాసక్తిగా అనిపిస్తే దేశభక్తి గేయాలు వినడం ఇదే గోపాలకృష్ణ దినచర్య.
‘సాక్షి’మెటీరియల్ ఉపయోగపడింది
‘సాక్షి’పత్రికను ప్రతిరోజూ చదవుతానని, ఎడిటోరియల్స్, ప్రత్యేక కథనాలను క్రమం తప్పకుండా చదవడంతో పాటు వాటిని కట్ చేసుకుని తర్వాత కూడా చదివేవాడినని గోపా లకృష్ణ చెప్పారు. ‘సాక్షి’భవిత కూడా తనకెం తో ఉపయోగపడిందన్నారు. ‘సాక్షి’దిన పత్రిక లో బాలలత పేరుతో ఎన్నో ఎడ్యుకేషన్ వ్యాసాలు రాశానన్నారు.
ఎన్నో అవమానాలు.. చీత్కారాలు..
సివిల్స్‌లో తర్ఫీదు పొందడానికి హైదరాబాద్ వచ్చిన తనకు ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదురయ్యాయని కన్నీటి పర్యంతమవుతూ ‘సాక్షి’కి వివరించారు గోపాలకృష్ణ. ఏ కోచింగ్ సెంటర్‌కు వెళ్లినా నువ్వు పనికిరావంటూ అడ్మిషన్ ఇవ్వడానికే నిరాకరించారని, అయినా దేవుని దయ, అమ్మానాన్నల దీవెనలు, అన్నయ్య కోదండరావు స్పూర్తి, స్నేహితుల సహకారంతో పట్టుదలతో చదివానన్నారు. చిన్నప్పుడు తాను పడ్డ బాధలు తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి ప్రతీకారంతో ఈ విజయాన్ని సాధించానని స్పష్టం చేశారు.
తమ ఊరికి కరెంట్ లేకపోతే దీపం వెలుగులో చదువుకున్నానని, ఇప్పటికీ తమ ఊరికి న్యూస్ పేపర్ అంటే ఏమిటో తెలియదని చెప్పారు. తనకు ఎటువంటి అలవాట్లూ లేవని, ఆకలి, ఇతర అవసరాలు లేకపోతే చదువే తన లోకమని, అందులోనే ఆనందం పొందుతానని అన్నారు. సివిల్స్‌లో ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
పదేళ్ల కృషి ఫలితం..
ప్రభుత్వాధికారి కావాలని, ప్రజలకు సేవ చేయాలని నిరంతరం తప్పించేవా డని, పదేళ్ల కృషితో కలెక్టర్ అవుతున్నాడని గోపాలకృష్ణ తల్లిదండ్రులు ఆనందం వ్య క్తం చేశారు. తన తమ్ముడు మంచి అధికా రిగా రాణిస్తాడనే నమ్మకం ఉందన్నారు గోపాలకృష్ణ సోదరుడు కోదండరావు .