- కిరాణ కొట్టు యజమాని కొడుకు సివిల్స్ విజేత
– వి. సాయి వంశీవర్థన్‌కు 220 ర్యాంకు
– రెండో ప్రయత్నంలో విజయం
– జార్ఖండ్‌లో మావోల కిడ్నాప్‌నకు గురైన వంశీవర్థన్
– పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ లక్రా స్ఫూర్తితో సివిల్స్
– పేదరిక నిర్మూలన కోసం ఆకాంక్ష పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు
కర్నూలు (సిటీ) : కృషి, పట్టుదల ఉంటే అత్యున్నత లక్ష్యాలను సాధించవచ్చని ఓ కిరాణ కొట్టు యజమాని కుమారుడు నిరూపించారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని అతను చాటిచెప్పారు. 2016 సివిల్స్ ఫలితాల్లో అతను ఏకంగా 220వ ర్యాంకు సాధించి తన ‘ఆకాంక్ష’ను నెరవేర్చుకున్నారు. కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయనిపేటకు చెందిన వి.సుధాకర్, వి.లక్ష్మిదేవి దంపతుల కుమారుడు వి.సాయివంశీవర్దన్..సివిల్స్‌లో మెరిశారు. చదువులో మొదటి నుంచి ముందంజలో ఉండటంతో అతనని.. తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. ప్రాథమిక విద్య వైఎస్‌ఆర్ జిల్లా జమ్ములమడుగు నుంచి మొదలైంది. ఇక్కడ 1 నుంచి 7వ తరగతి వరకు సెయింట్ మేరీస్ స్కూలు, 8 నుంచి 10వ తరగతి వరకు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీవాణి స్కూలులో చదివారు.
ఇంటర్మీడియట్ నెల్లూరు నారాయణ కళాశాలలో ఎంపీసీ గ్రూపు చదివి 950 మార్కులు సాధించారు. 2010లో చిత్తూరు జిల్లాలోని విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2010లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయగా ర్యాంక్ రాలేదు. అనంతరం టాటా కన్సల్టెన్సీ సర్వీసులో 2010–12 వరకు ఉద్యోగం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన ఫెలోషిప్‌కు ఎంపికై.. రెండు సంవత్సరాల పాటు జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి జిల్లాలో పని చేశారు. ఈ సమయంలో పరాస్‌నాథ్ కొండల్లో పర్యటిస్తుండగా.. నలుగురు మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అయితే 48 గంటల తర్వాత తిరిగి అతన్ని వదిలేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో పంజాబ్ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ లక్రాను స్ఫూర్తిగా తీసుకొని.. 2015 నుంచి సివిల్స్‌కోసం ఢిల్లీలోని వాదిరామ్ ఇన్సిట్యూట్‌లో శిక్షణ పొందారు. 2016 నోటిఫికేషన్ విడుదల కావడంతో సోషియాలజీ ఆప్షన్ పరీక్ష రాసి 220 ర్యాంకు సాధించారు.
అనాథలను ఆదుకునేందుకు ఆకాంక్ష ..
టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో స్నేహితులతో కలిసి పేద విద్యార్థులను, అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఆకాంక్ష పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ కోసం పని చేస్తున్న సమయంలోనే పేదరికం నిర్మూలించాలంటే ఐఏఎస్ సాధించి సమాజానికి తమవంతుగా సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు సాయి వంశీవర్థన్ తెలిపారు. అక్క సౌజన్య, బావ ప్రసాద్‌లు తనకు ఆర్థికంగా సాయం చేశారని చెప్పారు. స్నేహితులు రమేష్, రాజేష్...సలహాలు సూచలు ఇచ్చేవారని తెలిపారు.
ముత్యాల రాజు స్ఫూర్తి
- సివిల్స్ 905 ర్యాంకర్ రవికాంత్ మనోగతం
నంద్యాల: ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 2007 బ్యాచ్ సివిల్స్ టాపర్ ముత్యాల రాజు తనకు స్ఫూర్తి అని సివిల్స్ ర్యాంకర్ గోవిందపల్లె రవికాంత్ అన్నారు. బుధవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 905 ర్యాంక్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ర్యాంక్‌కు ఐపీఎస్, ఐఆర్‌ఎస్ వచ్చే అవకాశం ఉందని, మళ్లీ సివిల్స్ రాసి ఐఏఎస్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రోజూ 10 గంటలు చదివానని, మధ్యలో రిలాక్స్ కోసం ధ్యానం చేసేవాడినన్నారు. అమ్మ కృపమ్మ, నాన్న రాజు ఆశీస్సులతోనే తాను ఈ ఘనత సాధించానన్నారు.
కుటుంబ నేపథ్యం
రవికాంత్ తండ్రి రాజు రిటైర్డ్ కానిస్టేబుల్, తల్లి కృపమ్మ హెల్త్ సూపర్‌వైజర్. స్థానిక జ్ఞానాపురంలోని వైఎస్ ప్రభుదాస్‌రెడ్డి రోడ్డులో నివాసం ఉంటున్నారు. రవికాంత్ ఎన్‌జీఓ కాలనీలోని గుడ్‌షప్పర్డ్ స్కూల్‌లో 10వ తరగతి వరకు, హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్, వరంగల్‌లోని ఎన్‌ఐటీలో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత సివిల్స్‌లో ర్యాంకు సాధించడానికి ఏడాది పాటు హైదరాబాద్‌లోని రెండు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందారు. అనంతరం నెల్లూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఏడాది ఉద్యోగం చేసి మళ్లీ సివిల్స్ రాయడానికి రాజీనామా చేశారు. గత ఏడాది సివిల్స్‌లో ప్రిలిమినరీ, మెయిన్స్‌లో ప్రతిభ చూపినా ఇంటర్య్వూలో ఫెయిల్ అయ్యారు. దీంతో ఆయన మరింత పట్టుదలగా చదివి ప్రస్తుతం 905 ర్యాంకును సాధించారు.