
సివిల్స్ మెరుపులు
సత్తెనపల్లి/గుంటూరు రూరల్: గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు గురువారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు నగరం లక్ష్మీపురానికి చెందిన మదాల వెంటక దుర్గా ప్రణీత్ 476 ర్యాంక్ సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికకాగా.. సత్తెనపల్లికి చెందిన గంటి ప్రదీప్ 794 ర్యాంకు సాధించారు. ఐఏఎస్ సాధించడమే తమ లక్ష్యంగా విజేతలు పేర్కొన్నారు.
హెడ్‌కానిస్టేబుల్ కొడుకు ఐఆర్‌ఎస్‌కు..
గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మాదల నాగేశ్వరరావు కుమారుడు మాదల వెంటక దుర్గా ప్రణీత్ 476 వ ర్యాంకుతో ఐఆర్‌ఏస్ సాధించాడు. తల్లి మాదల లక్ష్మీసుజాత. ప్రత్తిపాడు నియోజకవర్గం, వట్టిచెరుకూరు మండలం, లేమల్లెపాడు గ్రామానికి చెందిన వారు ఉద్యోగ భాధ్యతలతో గుంటూరులోని లక్ష్మీపురంలో నివాసం ఉంటున్నారు. పెద్దకుమారుడు మాదల వెంటక దుర్గాప్రణీత్ కాగా, రెండో కుమారుడు మాదల కౌసిక్ ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్నాడు.
పణీత్ 2006లో వికాస్ పబ్లిక్ స్కూల్‌లో పదో తర గతి పూర్తి చేసుకున్నాడు. ఇంటర్ చైతన్య కళాశాలలో 2008లో పూర్తి చేశాడు. ఇంజనీరింగ్‌లో సీఈసీ విభాగంలో ఆర్‌వీఆర్‌అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో 89 శాతం సాధించి 2012లో ఉత్తీర్ణుడయ్యాడు. 2012 జూన్ నెలలో కోచింగ్ కోసం ఢిల్లీవెళ్లి 2013 నవంబర్ వరకు శిక్షణ పూర్తి చేసుకున్నాడు.
గురువారం వెలువడిన ఫలితాలలో ఐఆర్‌ఏస్ సాధించాడు. భవిష్యత్తులో ఎలాగైన ఐఏఏస్ సాధించడమే లక్ష్యమని చెబుతున్నారు. ఇంకా ఏమన్నాడంటే... ‘చిన్నతనం నుంచీ ఐఏఏస్ సాధించాలన్నదే నా ముఖ్య ధ్యేయం పెట్టుకున్నాను. కుటుంబ సభ్యుల సహకారం, తల్లి దండ్రుల దీవెనలే తోడుగా చదువు కొనసాగించాను. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఢీల్లీలో శిక్షణ పొందాను. రోజుకు ఆరు గంటలకు పైగా ప్రతి ఆంశంపై దృష్టి సారించడంతో పాటు న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్, ఇంటర్‌నెట్ వంటి వాటిపై శ్రధ్ద చూపించాను. ఈ రోజు వచ్చిన ఫలితాల్లో ఐఏఏస్ సాధించి ఉంటే బాగుండేది అని అనిపించింది. అయితే తిరిగి మరలా ఐఏఏస్ సాధించగలగను అనే నమ్మకం తన తల్లి దండ్రులు ఇచ్చారు.’ అన్నాడు
సత్తెనపల్లి కుర్రోడి విజయం
సత్తెనపల్లికి చెందిన గుంటి ప్రదీప్ 2013 డిసెంబర్‌లో జాతీయ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్ష రాశాడు. గురువారం ఫలితాలు రావడంతో జాతీయ స్థాయిలో 794వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ప్రదీప్ గతంలో హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్‌లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. కాని ఉద్యోగానికి వెళ్లలేదు. ఆ తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లోని కార్డ్ ఆఫీసులో ఆడిటర్‌గా ఉద్యోగం లభించింది. అంతేగాక బీటెక్ పూర్తి చేసిన ప్రదీప్ సాఫ్ట్‌వేర్‌గా వచ్చినప్పటికీ వెళ్లకుండా సివిల్ సర్వీసెస్‌లో అవకాశాలు మెండుగా ఉండడంతో ఇటువైపు దృష్టి సారించి విజయం సాధించాడు.
కుటుంబ నేపధ్యం : ప్రదీప్‌ది నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు. తల్లిదండ్రులు వృత్తిరీత్యా ప్రధానోపాధ్యాయులు కావడంతో సత్తెనపల్లిలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ప్రదీప్ తండ్రి సత్తెనపల్లిలోని ఎంపీయూపీ హ్యారిస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్నారు. తల్లి బి.హెలెన్ సెకెండ్‌గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా సత్తెనపల్లిలోని ఎంపీపీఎస్(ఎస్‌ఏవీఎన్)లో పని చేస్తున్నారు.
సోదరుడు ప్రణీత్ అసిస్టెంట్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా ఇటీవల ఉద్యోగం సాధించాడు. సోదరి మమత హైదరాబాద్‌లోని ఏపిటోన్స్‌కు ఇటీవల నియమితురాలైంది. ప్రదీప్ ఇంటర్మీడియట్ గుంటూరు నలంద కళాశాలలో, బీటెక్ గుంటూరు ఆర్‌వీఆర్‌లో చదివారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందనీ, ముందు నుంచి ప్రణాళికాయుతంగా చదవడం వల్లే విజయం సాధించాననీ చెప్పాడు. స్పష్టమైన అవగాహనతో ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాశాననీ, ఈ విభాగంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ పేర్కొన్నాడు. సివిల్స్ సాధించాలనేది తన లక్ష్యమని అందుకోసం ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.