* బీఏ సిలబస్‌లో మార్పులు చేర్పులు
* ఆంత్రోపాలజీ కాంబినేషన్లతో కొత్త కోర్సులు
* సోషియాలజీ, సోషల్ వర్క్ పాఠ్యాంశాల్లోనూ మార్పులు
* బీఏ విద్యార్థులు ఎన్జీవోలతో కలసి పనిచేసేలా ఒప్పందం
* చదువు పూర్తికాగానే ఉపాధి అవకాశాలు లభించేలా ఏర్పాట్లు
* తె లంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: సివిల్స్ పోటీ పరీక్షలకు అనుగుణంగా డిగ్రీ సిలబస్‌లో మార్పులు తేవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సివిల్స్ రాసేవారు ఆంత్రోపాలజీ సబ్జెక్టుకు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతా కాదు. అందుకే ఆంత్రోపాలజీ కాంబినేషన్‌తో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో (బీఏ) కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు డిగ్రీ స్థాయిలో ఆంత్రోపాలజీ కాంబినేషన్‌తో కోర్సులు ఉన్నా.. ఇటు ప్రభుత్వ కాలేజీలు, అటు ప్రైవేటు కాలేజీలు ఆ కోర్సులకు అడ్మిషన్లు తీసుకోవడం లేదు. ఇకపై అలా కాకుండా ఆయా కోర్సులను అన్ని కాలేజీలు కచ్చితంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంత కాలేజీల్లో కచ్చితంగా ఈ కోర్సులకు అడ్మిషన్లు చేపట్టాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సిలబస్ మారనుంది. ఈ మార్పుల్లో భాగంగా ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సోషల్ వర్క్ సబ్జెక్టుల సిలబస్‌ను మార్చాలని నిర్ణయించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ మల్లేశ్, ప్రొఫెసర్ వెంకటాచలం ఆధ్వర్యంలో అన్ని యూనివర్సిటీల విభాగాధిపతులు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, డీన్లతో సోమవారం సమావేశం జరిగింది.
ఇందులో డిగ్రీ సిలబస్‌లో తీసుకు రావాల్సిన మార్పులపై చర్చించారు. మార్పులు చేర్పుల్లో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సిలబస్, యూపీఎస్సీ సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలోని ప్రధాన అంశాలతో బీఏలో మూడేళ్లపాటు ఆంత్రోపాలజీ కాంబినేషన్‌తో కోర్సును నిర్వహిస్తారు.
తద్వారా సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి డిగ్రీ స్థాయి నుంచే పునాది వేయొచ్చని మండలి వైస్ చైర్మన్ మల్లేశ్ పేర్కొన్నారు. దీంతో డిగ్రీ తర్వాత కోచింగ్ సెంటర్లలో ఆంత్రోపాలజీలో శిక్షణ పొందాల్సిన అవసరం ఉండదన్నారు. బీఏలో హిస్టరీ-ఆంత్రోపాలజీ-సోషియాలజీ, ఆంత్రోపాలజీ-పొలిటికల్ సైన్స్-ఫిలాసఫీ, ఆంత్రోపాలజీ-సైకాలజీ-ఇంగ్లిష్ లిటరేటర్ వంటి కాంబినేషన్లతో మార్పులు తెస్తామన్నారు. సోషియాలజీ, సోషల్ వర్క్ సబ్జెక్టుల సిలబస్‌లోనూ మార్పులు తేనున్నారు.
ఈ మార్పులపై మరింత లోతుగా అధ్యయనం చేసి సిలబస్‌ను మార్చేందుకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సోషియాలజీ డీన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ విశ్వ విద్యాలయాల విభాగాధిపతులు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి అదనంగా.. డిగ్రీ కాలేజీల్లో బోధించే 10 మంది లెక్చరర్లతో మరో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. వీటన్నింటికి సమన్వయకర్తగా ఉస్మానియా విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ గణేశ్ వ్యవహరిస్తారు.
సోషియాలజీలో ముఖ్యంగా ప్రాంతీయ సంస్కృతి అంశంలో తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతికి పెద్దపీట వేస్తారు. సోషియాలజీ, సోషల్ వర్క్ వంటి సబ్జెక్టులతో బీఏ చేసే వారి సిలబస్‌ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చడంపై దృష్టి సారిస్తారు. ఇందులో భాగంగా క్షేత్ర పర్యటనలు, ఇతర ప్రాక్టికల్స్ విషయంలో ఎన్‌జీవో సంస్థలతో కలసి విద్యార్థులు పని చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. దీంతో డిగ్రీ పూర్తయ్యాక విద్యార్థులకు ఎన్‌జీవో సంస్థల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.
సివిల్స్‌కు అనుగుణంగా డిగ్రీ!
Published Tue, Dec 16 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM
Advertisement
Advertisement