తెలుగు చేవ తగ్గుతోందా? | The problem from the beginning Sisat inception | Sakshi
Sakshi News home page

తెలుగు చేవ తగ్గుతోందా?

Published Mon, Feb 22 2016 12:36 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

తెలుగు చేవ తగ్గుతోందా? - Sakshi

తెలుగు చేవ తగ్గుతోందా?

సీశాట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మొదలైన సమస్య  
ప్రాంతీయ భాషా నేపథ్యమున్న అభ్యర్థులు నెగ్గుకురాలేకపోతున్నారన్న నిపుణులు
 

 సాక్షి, ఎడ్యుకేషన్ డెస్క్: దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ తదితర 24 అఖిల భారత సర్వీసుల్లో అభ్యర్థుల ఎంపికకు యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ప్రాంతీయ భాషల అభ్యర్థుల ప్రాభవం తగ్గుతోందా? హిందీ, ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు.. మెట్రో నేపథ్యమున్న అభ్యర్థులకే పరీక్ష విధానం అనుకూలంగా ఉంటోందా? ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులపైనా పడుతోందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష-2015 ఫలితాల ద్వారా ఈ విషయం మరింత ప్రస్ఫుటమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 గతంలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు
 సివిల్స్... ఈ పరీక్షలో విజయం కోసం తపస్సులా కృషి చేసే అభ్యర్థుల సంఖ్య రాష్ట్రంలో వేలల్లోనే ఉంటుంది! వారి కష్టం ఫలితాల్లోనూ కనిపించేది. 2005 నుంచి 2010 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 80 నుంచి 100 మంది వరకు తుది విజేతలుగా నిలిచారు. ఇదేకాలంలో రెండుసార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు కూడా తెలుగు అభ్యర్థులు (రేవు ముత్యాల రాజు, అడపా కార్తీక్) సొంతం చేసుకున్నారు. కానీ 2011 నుంచి తుది విజేతలుగా నిలిచే అభ్యర్థుల సంఖ్య తగ్గుతోందని, సగటున 30 నుంచి 40 మధ్యలోనే ఉంటోందని నిపుణులు అంటున్నారు. సివిల్స్ ఎంపిక ప్రక్రియలో మార్పులే ఇందుకు కారణమని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. తాజాగా విడుదలైన సివిల్స్ మెయిన్స్ 2015 రాత పరీక్ష ఫలితాల్లోనూ ఇదే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు 500 మంది వరకు హాజరుకాగా.. తాజా ఫలితాల్లో ఇంటర్వ్యూకు ఎంపికైన వారు గరిష్టంగా 80 మందికి మించి ఉండరని అంచనా.

 సీశాట్ నుంచి మొదలైన సమస్య
 సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ఇతర ప్రాంతీయ భాషా అభ్యర్థుల సంఖ్య క్రమేణా తగ్గడం సీశాట్ (సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్) ప్రవేశపెట్టినప్పటి నుంచి మొదలైంది. 2011 నుంచి ప్రిలిమినరీ పరీక్షలో రెండో పేపర్‌గా సీశాట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటివరకు అభ్యర్థులకు రెండో పేపర్‌గా తమకు నచ్చిన ఆప్షనల్ సబ్జెక్ట్‌ను రాసుకునే వెసులుబాటు ఉండేది. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ పేరుతో, అదేవిధంగా అభ్యర్థుల్లో అన్నిరకాల సామర్థ్యాలను అంచనా వేయాలనే ఉద్దేశంతో ప్రవేశ పెట్టిన సీశాట్.. అందుకు విరుద్ధంగా కేవలం ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యమున్న వారికే అనుకూలంగా ఉందనే నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో 2014 నుంచి సీశాట్‌లోని ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్‌ను తొలగించారు.

సీశాట్ పేపర్ (జనరల్ స్టడీస్ పేపర్-2)ను కేవలం అర్హత పరీక్షగానే పేర్కొంటూ గతేడాది నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో 200 మార్కులకు కనీసం 33 శాతం మార్కులు సాధించాలని యూపీఎస్‌సీ పేర్కొంది. ఈ కనీస అర్హత మార్కుల నిబంధన కూడా ప్రాంతీయ భాషల అభ్యర్థులు, నాన్-మ్యాథ్స్ అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. కారణం.. ఈ పేపర్‌లో పేర్కొన్న అంశాలన్నీ మ్యాథమెటికల్ ఓరియెంటెడ్‌గా, ఇంగ్లిష్ ఓరియెంటేషన్‌గా ఉండటమే. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్‌ను తొలగించినప్పటికీ.. రీడింగ్ కాంప్రహెన్షన్‌ను కొనసాగించడం ప్రాంతీయ భాషా అభ్యర్థులకు శరాఘాతమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 మెయిన్స్‌లో మార్పులతో మరింతగా..
 2013లో మెయిన్ పరీక్షలోనూ యూపీఎస్‌సీ మార్పులు ప్రవేశపెట్టింది. అప్పటి వరకు ఒక ప్రాంతీయ భాష, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఎస్సే, రెండు జీఎస్ పేపర్లు, రెండు ఆప్షనల్ సబ్జెక్ట్స్ (నాలుగు పేపర్ల)లలో సివిల్స్ మెయిన్‌‌స పరీక్షలు జరిగేవి. కానీ 2013 నుంచి ఈ విధానంలో మార్పు తెచ్చింది. 2014లో మరోసారి మార్పులు చేసింది. 2012 వరకు ఉన్న రెండు ఆప్షనల్ సబ్జెక్ట్‌లను ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌కు కుదించింది. జనరల్ స్టడీస్ పేపర్లను నాలుగుకు పెంచింది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 శాతం, ఇండియన్ లాంగ్వేజ్‌లో 30 శాతం(2015లో 25 శాతంగా మార్పు) కనీస అర్హత మార్కులు సాధిస్తేనే.. అభ్యర్థులు మిగతా పేపర్లలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని పేర్కొంది. ఇప్పుడు ప్రాంతీయ మాధ్యమంలో చదివిన అభ్యర్థులకు ఇదే సమస్యగా మారింది. మెయిన్  ఎగ్జామినేషన్‌లో పేర్కొన్న 4 జనరల్ స్టడీస్ పేపర్ల విషయంలోనూ ప్రతికూలతలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. దేశంలో విద్యా వ్యవస్థకు.. యూపీఎస్‌సీ సివిల్స్‌లో ప్రవేశపెడుతున్న మార్పులకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని, అందుకే ప్రాంతీయ భాష నేపథ్యం ఉన్న అభ్యర్థులు, గ్రామీణ అభ్యర్థులు నెగ్గుకు రాలేకపోతున్నారని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.
 
 మళ్లీ ఆప్షనల్.. అదే పరిష్కారం
 అన్ని ప్రాంతాలు, నేపథ్యాల అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌లో ప్రాతినిథ్యం వహించేలా లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌కు ఆస్కారం కల్పించాలంటే.. మళ్లీ ప్రిలిమ్స్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఫలితంగా అభ్యర్థులు తాము అకడమిక్‌గా చదువుకున్న సబ్జెక్ట్‌లలో పట్టున్న సబ్జెక్ట్‌లను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవడం, తద్వారా మెయిన్స్‌కు విజయావకాశాలకు ఆస్కారం ఉంటుంది. సీశాట్ వల్ల గత నాలుగేళ్లుగా ఇంటర్వ్యూకు ఎంపికవుతున్న తెలుగు అభ్యర్థుల సంఖ్య 70 నుంచి 80 మధ్యలో.. తుది జాబితాలో నిలుస్తున్న అభ్యర్థుల సంఖ్య 30 నుంచి 40 మధ్యలోనే ఉంటోంది. తెలుగు లిటరేచర్ ఆప్షనల్‌గా ఎంచుకున్న వారి విజయావకాశాలు సైతం తగ్గిపోతున్నాయి. 2010లో తెలుగు లిటరేచర్ ఆప్షనల్‌తో 12వ ర్యాంకు రాగా.. 2013లో తెలుగు లిటరేచర్ ఆప్షనల్‌కు 887వ ర్యాంకు రావడమే ఇందుకు నిదర్శనం. సీశాట్ వల్ల అన్ని ప్రాంతీయ భాషల అభ్యర్థులకు సివిల్స్ అందని ద్రాక్షగా మారిపోతోంది. - వి. గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ
 
 ఇంగ్లిష్ నేపథ్యానికి అనుకూలం వాస్తవమే
 ప్రస్తుతమున్న సివిల్స్ ఎంపిక విధానం ఇంగ్లిష్ నేపథ్యం ఉన్న వారికి అనుకూలం అనే మాట వాస్తవమే. పరీక్షలో విజయానికి అనుకూలించే మెటీరియల్ పరంగా ఇంగ్లిష్‌లో అపారమైన వనరులున్నాయి. ప్రాంతీయ భాషల అభ్యర్థులు వాటిని అనువాదం చేసుకుని చదువుకోవడం అత్యంత క్లిష్టంగా మారుతోంది. ఇక సీశాట్‌లో పేర్కొన్న రీడింగ్ కాంప్రహెన్షన్‌ను కూడా తొలగిస్తే లోకల్ లాంగ్వేజ్ అభ్యర్థులకు అనుకూలంగా ఉంటుంది.
     - శ్రీరామ్, డెరైక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్
 
    అవన్నీ అపోహలే
 యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రస్తుత విధానం కొందరికే అనుకూలం అనే అభిప్రాయాలన్నీ అపోహలే. అభ్యర్థులు తమకు నచ్చిన మాధ్యమంలో పరీక్ష రాసుకునే వీలుంది. అయితే విజేతలుగా నిలుస్తున్న అభ్యర్థుల నేపథ్యాలను పరిగణించడం కారణంగా కొందరికే అనుకూలం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అత్యధిక శాతం మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ వంటి కోర్సులవైపు అడుగుపెడుతున్నారు. ఇదే క్రమంలో సివిల్స్‌కు హాజరయ్యే ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది.     
     - ప్రొఫెసర్ వై.వెంకటరామిరెడ్డి, యూపీఎస్‌సీ మాజీ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement