పది ఫెయిలైనా..కావచ్చు ఐఏఎస్!
* సివిల్స్ సాధించాలంటే.. సేవా గుణం ఉండాలి
* ఇంగ్లిష్ వస్తేనే.. అపోహ మాత్రమే
* తెలుగులో రాసిన చాలామంది కలెక్టర్‌లు అయ్యారు
* ‘కోచింగ్’ నోట్స్ ఇస్తుంది.. నాలెడ్జ్ ఇవ్వదు
* అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్
ఇందూరు: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే చాలా మంది సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. కాని సమాజ సేవనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళితే సివిల్స్ సాధించడం త్వరగా సాధ్య పడుతుందని కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. సమాజ సేవ కోసం సివిల్స్ చదివి ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటామని చెప్తారే కానీ, సమాజ సేవను ఎందుకు లక్ష్యంగా పెట్టుకోకూడదని అన్నారు.
శుక్రవారం తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడారు. ప్రసంనికి ముందు సివిల్స్‌కు ప్రిపేర్ కావాలంటే ఏం చేయాలో సదస్సుకు వచ్చిన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన వివరాలను ఓ విద్యార్థినిచే నోట్ చేయించారు. వారు చెప్పిన ఒక్కో అంశాన్ని తీసుకుని మాట్లాడుతూ... ప్రశ్నల వర్షం కురిపించారు.
వారు వ్యక్తం చేసిన సందేహాలకు, ప్రశ్నలకు విద్యార్థుల చేతనే సమాధానాలు చెప్పిస్తూ తాను కూడా సమాధానాలు, సందేహాలను నివృత్తి చేశారు. దాదాపు గంటకు పైగా విద్యార్థులతో సంభాషించి కలెక్టర్ హోదాను పక్కనపెట్టి ఒక టీచర్‌గా మారిపోయారు. ప్రయివేటు విద్యా సంస్థల్లో చదువుతున్నవారే సివిల్స్‌కు సిద్ధమవుతున్నారని, ప్రభుత్వ సంస్థల్లో చదివిన వారు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
అయితే ఇంగ్లీషు వచ్చి ఉంటేనే పరీక్షలు రాయగలుగుతారనే విషయం ఇక్కడ చాల మంది చెబుతున్నారు. కాని తెలుగు నేర్చుకున్న వారు సివిల్స్ పరీక్ష రాసే అవకాశం ఉందని, తెలుగులో పరీక్షలు రాసి ఐఏఎస్‌లు అయినవారు చాలా మంది ఉన్నారని తెలిపారు. పరీక్షలు రాయకపోవడగానికి కూడా పట్టుదల లేకపోవడం, భయం, నమ్మకం లేకపోడం కూడా కారణమవుతాయన్నారు.
చిన్ననాటి నుంచే బాగా చదివితేనే సివిల్స్ సాధిస్తామనేది ఒక అపోహ మాత్రమేనని, పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫెయిలైనా.. తిరిగి పాసై సివిల్ పరీక్షలు రాసిన వారు ఎందరో ఉన్నారని తెలిపారు. 16 గంటలు చదివితేనే గోల్ సాధ్యమవుతుందని చాలా మంది గంటల తరబడి పుస్తకాలతో కుస్తీపడుతారని, ప్రస్తుత కాలంలో ఆ పద్ధతి పాటించడం లేదన్నారు.
తాను చదువుకున్న కాలంలోనే రోజుకు 3 నుంచి 4 గంటల సమయం కేటాయించే వాడినని తెలిపారు. తమనకు ఏదీ నచ్చితే ఆదే చదవాలని, అదే నేర్చుకోవాలనే పట్టుదల ఉండాలని పోటీ పరీక్షలు నాలుగైదు సార్లు రాస్తే కాని అనుభవం రాదన్నారు. ఇంట్లో కూర్చుండి పరీక్షలకు సిద్ధం కావడం సాధ్యపడదని, అలాగని కోచింగ్ తీసుకుంటే అస్సలు సాధ్యపడదన్నారు. ఎందుకంటే కోచింగ్‌లో నోట్స్‌లభిస్తుందే కాని నాలెడ్జ్ లభించదన్నారు. అనుభవాజ్ఞులు, లేదా తోటి స్నేహితుల సహాలు,సూచనలు తీసుకుని ప్రశాంతమైన వాతావరణంతో మైండ్‌సెట్‌తో చదివితే లక్ష్యంగా నెరవేరుతుందన్నారు.
వీటితో పాటు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దిన పత్రిలు, రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాలు చదివితే మరింత సులువుగా ఉంటుందన్నారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సవిల్స్‌కు సిద్ధం కావడానికి మంచి అవకాశమని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాని సూచించారు.అయితే అన్ని ఉద్యోగాల కన్నా సివిల్స్ సాధించి ఉద్యోగం పొందడం గొప్ప విషయమని అన్నారు.
సివిల్స్‌కు ఉన్న పాముఖ్యత అలాంటిదని అన్నారు. అన్ని రకాలుగా సమాజ చేయాలంటే సివిల్స్‌కు మించిన మార్గం మరొకటి లేదని స్పష్టం చేశారు. అనంతరం ప్రత్యేక శిక్షకుల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి విమలాదేవి, సహాయ సంక్షేమాధికారులు విజయ్‌కుమార్, శంకర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.