ఇదేమి న్యాయం!
- సమస్యలు పరిష్కరించమంటే టీసీలు ఇస్తామంటారా?
– కలెక్టర్ తీరుపై కేవీఆర్ కళాశాల విద్యార్థినుల నిరసన
కర్నూలు(అర్బన్): కేవీఆర్ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. తమ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గత సోమవారం వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లితే టీసీలు ఇస్తామని కలెక్టర్ బెదిరించడాన్ని నిరసిస్తూ బుధవారం కళాశాల మెయిన్ గేటు ఎదుట ధర్నా చేశారు. ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్ సంఘాల ఆధ్వర్యంలో వందల సంఖ్యలో విద్యార్థినులు అక్కడికి చేరుకుని రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి రంగన్న, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్, రాజ్‌కుమార్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్ బాబు, ఐద్వా నాయకురాలు సుజాత విద్యార్థినుల ఆందోళనకు సంఘీభావం తెలిపి మాట్లాడారు.
కేవీఆర్ కళాశాలలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, అలాగే తరగతి గదులను నిర్మించాలని కోరగా జిల్లాకలెక్టర్ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడమే కాక టీసీలు ఇచ్చి పంపించాలని ఆదేశాలు జారీ చేయడం ఆయన అధికార దర్పానికి నిదర్శనమన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించాల్సింది పోయి విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేయడం దారుణమన్నారు. విద్యార్థినులకు టీసీలు ఇచ్చి వారి భవిష్యత్తును ఎలా నాశనం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నగర అధ్యక్షుడు ప్రతాప్, నాయకులు అంజి, అయ్యస్వామి, పవన్, రాము, బాబు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గిరి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.