kvr college
-
కేవీఆర్ స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోం
– కొందరి స్వార్థం కోసం పేద విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే సహించం – అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ బుట్టా రేణుక – ఎంపీ రాకతో కబ్జా స్థలంలోని పునాదుల్లో మార్పులు – టౌన్ ప్లానింగ్ ప్రకారం దగ్గర ఉండి కొలతలు వేయించిన హఫీజ్‌ఖాన్, విద్యార్థి సంఘాల నాయకులు కర్నూలు సిటీ: రోడ్డు విస్తరణలో అధికార పార్టీ నేతల మాటలు విని ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదని కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక నగరపాలక సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో స్టే ఉన్నా కేవీఆర్ కాలేజీ క్యాంపస్ స్థలాన్ని కబ్జా చేయాలని అధికార పార్టీ నేతల అనుచరులు గోడను కూల్చి వేయడంతో రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ బుట్టారేణుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ హఫీజ్‌ఖాన్, కేంద్ర పాలక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డితో కలిసి కేవీఆర్ కాలేజీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అర్ధరాత్రి గోడను కూల్చివేయడం, తదితర పరిణామాల గురించి హఫీజ్‌ఖాన్, విద్యార్థి సంఘాల నాయకులు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలమ్మ ఎంపీకి వివరించారు. ఆ తరువాత నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథ్‌రెడ్డి, ఇతర అధికారులతో ఆమె చర్చించారు. అనుమతులు లేకుండా అర్ధరాత్రి మహిళ కాలేజీ గోడను కూల్చి వేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కొందరికి ప్రయోజనం చేకూర్చడ కోసం కాలేజీ స్థలాన్ని ఆక్రమించుకోవడం తగదన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ బుట్టా రేణుక మండిపడ్డారు. గతంలో మాదిరిగా 6 మీటర్ల వరకు మాత్రమే స్థలాన్ని తీసుకోవాలని ఇంతకు మించి ఎక్కువ తీసుకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ప్రహరీ గోడ కూల్చివేతతో విద్యార్థినులకు రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ ప్రకారమే రోడ్లు విస్తరించాలని చెప్పారు. అనంతరం అందుకు సంబంధించిన మ్యాప్‌లు తెప్పించి, ప్రస్తుతం తీసిన పునాదుల నుంచి బయటి వైపునకు 2 మీటర్లు వదిలి గోడ నిర్మాణం జరపాలని సూచించారు. ఇందుకు కమిషనర్ హరినాథ్‌రెడ్డి హామీ ఇచా్చరు. అలాగే విద్యార్థినులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం టౌన్ ప్లానింగ్ ప్రకారం హఫీజ్‌ఖాన్ దగ్గర ఉండి కొలతలు వేయించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేందర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అద్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ నాగరాజు యాదవ్, నాయకులు రాఘవేంద్రరెడ్డి, రాజశేఖర్, ట్రేడ్ యూనియన్ సిటీ నాయకులు కటారీ సురేష్, జాన్, బుజ్జీ, రవి, అశోక్, కుమార్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అనిల్‌కుమార్, రాజు, కిరణ్, సాంబ, ఏసన్న, ప్రవీణ్, లోకేష్, చెన్నప్ప, చంద్రశేఖర్‌గౌడు, తాఫీక్, శీను, విద్యార్థి సంఘాల నాయకులు రంగన్న, చంద్రప్ప, రామకృష్ణ, భాస్కర్, రాజ్‌కుమార్, రమేష్, సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, తదితరులు పాల్గొన్నారు. -
ఇదేమి న్యాయం!
- సమస్యలు పరిష్కరించమంటే టీసీలు ఇస్తామంటారా? – కలెక్టర్ తీరుపై కేవీఆర్ కళాశాల విద్యార్థినుల నిరసన కర్నూలు(అర్బన్): కేవీఆర్ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. తమ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గత సోమవారం వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లితే టీసీలు ఇస్తామని కలెక్టర్ బెదిరించడాన్ని నిరసిస్తూ బుధవారం కళాశాల మెయిన్ గేటు ఎదుట ధర్నా చేశారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ సంఘాల ఆధ్వర్యంలో వందల సంఖ్యలో విద్యార్థినులు అక్కడికి చేరుకుని రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రంగన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్, రాజ్‌కుమార్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్ బాబు, ఐద్వా నాయకురాలు సుజాత విద్యార్థినుల ఆందోళనకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. కేవీఆర్ కళాశాలలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, అలాగే తరగతి గదులను నిర్మించాలని కోరగా జిల్లాకలెక్టర్ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడమే కాక టీసీలు ఇచ్చి పంపించాలని ఆదేశాలు జారీ చేయడం ఆయన అధికార దర్పానికి నిదర్శనమన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించాల్సింది పోయి విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేయడం దారుణమన్నారు. విద్యార్థినులకు టీసీలు ఇచ్చి వారి భవిష్యత్తును ఎలా నాశనం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు ప్రతాప్, నాయకులు అంజి, అయ్యస్వామి, పవన్, రాము, బాబు, ఎస్ఎఫ్ఐ నాయకులు గిరి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థినులపై దాడులకు అధికారులదే బాధ్యత
– కేవీఆర్ హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు సిటీ: రాష్ట్రంలో కె.వి.ఆర్ డిగ్రీ కాలేజీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి కళాశాల గోడను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం తగదు. ఇక్కడి విద్యార్థులపై ఎలాంటి దాడులు జరిగినా అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె కేవీఆర్ కళాశాలను సందర్శించి కూల్చివేసిన గోడతో పాటు కాలేజీ హాస్టల్, కిచెన్ గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు ఒకచోట గోడను కూల్చివేయాలనుకున్నప్పుడు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిందేనన్నారు. ఓ పార్టీ నాయకుడు చెప్పాడని ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కళాశాల గోడ కూల్చివేయడం చట్టవిరుద్ధమన్నారు. రోడ్ల విస్తరణలో భాగంగా గోడను కూల్చివేయదలిస్తే ముందుగా అక్కడి ప్రజలకు రక్షణ గోడ నిర్మించిన తర్వాతే ఆ పని చేయాలన్నారు. కొందరు అధికారులు అధికార పార్టీ నాయకులు దుకాణాలు నిర్మించుకునేందుకే రోడ్డు విస్తకరణ సాకుతో విద్యార్థినుల ఆట స్థలంలోకి చొచ్చుకుని రావడం సమంజసం కాదన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. అదేవిధంగా హాస్టల్లో విద్యార్థినుల సమస్యలను కూడా పరిష్కరిస్తానన్నారు. అనంతరం ఎంపీ విద్యార్థినులతో ముచ్చటించారు. ఆమె వెంట కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి హఫీజ్‌ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
తంగిరాల నిస్వార్థ నేత
సంతాపసభలో పలువురు వక్తలు నందిగామ : తంగిరాల ప్రభాకరరావు పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎనలేని సేవ చేశారని ఆయన నిస్వార్థ ప్రజా జీవితాన్ని, నిబద్ధతను మరువలేమని భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక కేవీఆర్ కళాశాలలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అర్జునుడు అధ్యక్షతన ఆదివారం సంతాప సభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ తంగిరాల తన కుడిభుజం లాంటివాడని, ఆయన మరణం తెలుగుదేశం పార్టీకే కాక నందిగామ నియోజకవర్గానికి తీరని లోటన్నారు. నియోజకవర్గంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న నిస్వార్థ ప్రజానాయకుడని కొనియాడారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అవినీతిని అంతం చేయాలనే తపన కలిగిన మహా నాయకుడు తంగిరాల అని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్ మాట్లాడుతూ తంగిరాల ఆదర్శవంతమైన నాయకుడన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు తంగిరాలను ఆదర్శంగా తీసు కోవాలని చెప్పారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ తంగిరాల ఈ ప్రాంతానికి చేసిన సేవలు మరువరానివని మరొక సారి ఆయన కుటుంబాన్ని ఆదరించాలని కోరారు. ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వల్లనేని వంశీమోహన్, శ్రీరాంరాజగోపాల్ (తాతయ్య), ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, వైవీపీ రాజేంద్రప్రసాద్, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు పద్మజ్యోతి, దాసరి బాలవర్థనరావు, మాజీ మంత్రి నెట్టెం రాఘురాం, తెలుగుదేశం నాయకులు వర్ల రామయ్య, స్వామిదాసు, సుధారాణి, కడియాల రాఘవారావు, బుద్ద వెంకన్న, కన్నెకంటి జీవరత్నం, కోట వీరబాబు, కేవి.సాంబశివరావు, సూర్యదేవర నాగేశ్వరరావు, గద్దె అనురాధ, కోగంటి బాబు, ఉన్నం నరసింహారావు, అయ్యదేవర కన్నబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామినేని కృష్ణప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల్పించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. నిబద్ధత కలిగిన నేత : మొండితోక జగన్మోహనరావు ఎంతో అనుభవం ఉన్న నిబద్ధత కలిగిన రాజకీయనాయకుడు తంగిరాల అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు. సంతాప సభలో ఆయనమాట్లాడుతూ ఆయనపై పోటీ చేయటం గర్వంగా ఉందని చెప్పారు. జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు శ్రీ బొగ్గవరపు శ్రీ శైల వాసు, మండల కన్వీనర్ నెలకుదిటి శివనాగేశ్వరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మంగునూరి కొండారెడ్డి, మండల సేవాదళ్ కన్వీనర్ పరిమి కిశోర్ పాల్గొన్నారు. తంగిరాలను టీడీపీ ఎమ్మెల్యేగా చూడలేదు : మాజీ ఎంపీ లగడపాటి తంగిరాల ప్రభాకరరావును పార్టీలకతీతంగా సేవాభావం కలిగిన ఎమ్మెల్యేగానే చూశామే తప్పా ఏనాడు టీడీపీ ఎమ్మెల్యేగా భావించలేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయనతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలేటి సతీష్, జిల్లా నాయకుడు రేపాల మోహనరావు, కేడీసీసీ డెరైక్టర్ కొమ్మినేని రవిశంకర్, పోపూరి సంగీతరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా క్రాస్‌కంట్రీ పరుగు పోటీలు
గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రాస్‌కంట్రీ పరుగు పోటీల్లో ఇబ్రహీంపట్నం, నందిగామ విద్యార్థులు ప్రతిభ చాటారు. పురుషుల విభాగంలో ఇబ్రహీంపట్నం డాక్టర్ జాకీర్‌హుస్సేన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, మహిళల విభాగంలో నందిగామ కేవీఆర్ కళాశాల విద్యార్థులు మొదటిస్థానం సాధించారు. శనివారం స్థానిక ఏఎన్నార్ కళాశాలలో ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ పోటీలు జరిగాయి. పురుషుల విభాగంలో 12 కిలోమీటర్లు, మహిళల విభాగంలో 6 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. యూనివర్సిటీ పరిధిలోని మొత్తం 13 కళాశాలలకు చెందిన 100 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పురుషుల విభాగంలో మొవ్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండో, గుడివాడ ఏఎన్నార్ కళాశాల మూడో, నందిగామ కేవీఆర్ కళాశాల విద్యార్థులు నాలుగో స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో గుడివాడ ఏఎన్నార్ కళాశాల రెండో, విజయవాడ ఎస్జీఎంఎస్ కళాశాల మూడో, మేరీ స్టెల్లా కళాశాల విద్యార్థులు నాలుగో స్థానం సాధించారు. పురుషుల పోటీలను స్థానిక ఏలూరు రోడ్డులోని వీకేఆర్ అండ్ వీఎన్‌బీ పాలిటెక్నిక్ వద్ద ఏఎన్నార్ కళాశాల కోశాధికారి కె.ఎస్.అప్పారావు, మహిళల పోటీలను పెదపారుపూడి మండలం దోసపాడులో సర్పంచ్ సజ్జా శివకుమార్ ప్రారంభించారు. ఈ పోటీల్లో ఒక్కొక్క కళాశాల నుంచి ఆరు నుంచి తొమ్మిది మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు ఆర్డీవో వెంకటసుబ్బయ్య బహుమతులు అందజేశారు. క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణిస్తారు.. క్రీడలపై ఆసక్తి ఉంటే అన్ని రంగాల్లో రాణించగలుగుతారని ఆర్డీఓ ఎస్.వెంకటసుబ్బయ్య అన్నారు. పరుగు పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంచడంతో పాటు మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయన్నారు. ప్రతి విద్యార్థీ తనకు తోచిన క్రీడపై ఆసక్తి పెంచుకుని అందులో నైపుణ్యం సాధించడానికి ప్రయత్నించాలని సూచించారు. కృష్ణా యూనివర్సిటీ ఈ విధమైన గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. కృష్ణా యూనివర్సిటీ పరిశీలకుడు ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరానికి గాను క్రీడల అభివృద్ధి, ప్రోత్సాహానికి రూ.33 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపారుపూడి కళాశాల కార్యదర్శి పర్వతనేని నాగేశ్వరరావు, కోశాధికారి కేఎస్ అప్పారావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.శంకర్, పీజీ డెరైక్టర్ నరసింహారావు, వ్యాయామ ఉపాధ్యాయుడు వై.ఉదయభాస్కర్, టి.శ్రీనివాసరావు, లైబ్రేరియన్ పద్మజ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.