గేటును పరిశీలిస్తున్న ఎంపీ బుట్టా రేణుక
విద్యార్థినులపై దాడులకు అధికారులదే బాధ్యత
Published Fri, Nov 4 2016 9:54 PM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM
– కేవీఆర్ హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు సిటీ: రాష్ట్రంలో కె.వి.ఆర్ డిగ్రీ కాలేజీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి కళాశాల గోడను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం తగదు. ఇక్కడి విద్యార్థులపై ఎలాంటి దాడులు జరిగినా అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె కేవీఆర్ కళాశాలను సందర్శించి కూల్చివేసిన గోడతో పాటు కాలేజీ హాస్టల్, కిచెన్ గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు ఒకచోట గోడను కూల్చివేయాలనుకున్నప్పుడు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిందేనన్నారు. ఓ పార్టీ నాయకుడు చెప్పాడని ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కళాశాల గోడ కూల్చివేయడం చట్టవిరుద్ధమన్నారు. రోడ్ల విస్తరణలో భాగంగా గోడను కూల్చివేయదలిస్తే ముందుగా అక్కడి ప్రజలకు రక్షణ గోడ నిర్మించిన తర్వాతే ఆ పని చేయాలన్నారు. కొందరు అధికారులు అధికార పార్టీ నాయకులు దుకాణాలు నిర్మించుకునేందుకే రోడ్డు విస్తకరణ సాకుతో విద్యార్థినుల ఆట స్థలంలోకి చొచ్చుకుని రావడం సమంజసం కాదన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. అదేవిధంగా హాస్టల్‌లో విద్యార్థినుల సమస్యలను కూడా పరిష్కరిస్తానన్నారు. అనంతరం ఎంపీ విద్యార్థినులతో ముచ్చటించారు. ఆమె వెంట కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి హఫీజ్‌ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Advertisement