పాత దానికి ఎగువన కొత్తది నిర్మించాలి..
నవంబర్ నుంచి 2025 జూలైలోగా పూర్తి చేయాలి
ఒకే సీజన్‌లో నిర్మించేందుకు అదనంగా గ్రాబర్లు, కట్టర్లు, నిపుణులు అవసరం
అక్టోబర్‌లోగా 3 మీటర్ల ఎత్తుతో ప్లాట్‌ఫాం సిద్ధం చేయాలి
పటిష్టంగా ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు
పీపీఏ, సీడబ్ల్యూసీలకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఎగువన సమాంతరంగా కొత్తగా పాత పద్ధతిలోనే డయాఫ్రం వాల్ నిర్మించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరోసారి స్పష్టం చేసింది. పాత డయాఫ్రం వాల్‌ను 15 నెలల్లో నిర్మించారని గుర్తు చేస్తూ.. కొత్త డయాఫ్రం వాల్‌ను ఈ ఏడాది నవంబర్ నుంచి 2025 జూలైలోగా పూర్తి చేయాలని పేర్కొంది.
ఒకే సీజన్‌లో ఆ పనులు చేసేందుకు అదనంగా గ్రాబర్లు, కట్టర్లు, అనుబంధ యంత్ర పరికరాలు, నిపుణులైన సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించింది. డయాఫ్రం వాల్ డిజైన్, నిర్మాణంపై చర్చించేందుకు తక్షణమే వర్క్ షాప్ నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ, పీపీఏలకు ఈనెల 20న అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది.
అందులో కమిటీ సిఫార్సులు ఇవీ..
⇒ ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పటిష్టంగా ఉన్నాయి. వాటి భద్రతకు ఎలాంటి ముప్పు లేదు. ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీకి అడ్డుకట్ట వేయడానికి టోయ్ (అడుగు భాగం)లో ఫిల్టర్లు వేయాలి.
⇒ ఎగువ, దిగువ కాఫర్ డ్యాం మధ్య సముద్ర మట్టానికి 3 మీటర్ల లోపు ఎత్తు ఉండేలా సీపేజీ నీటిని గ్రావిటీతో పంపడంతోపాటు పంపులతో ఎత్తిపోయాలి.
⇒ ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో గోదావరి నదీ గర్భం సముద్ర మట్టానికి సగటున 13 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దానిపై ఇసుకతో నింపి వైబ్రో కాంపాక్షన్ చేసి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి వీలుగా ప్లాంట్‌ఫామ్ సిద్ధం చేయాలి. పూర్తిగా పొడి వాతావరణంలోనే డయాఫ్రం వాల్‌ను నిర్మించాలి.
⇒ కొత్త డయాఫ్రం వాల్‌ను పాత పద్ధతిలోనే నిర్మించాలి. గ్రాబర్లు, కట్టర్లతో రాతి పొర తగిలే వరకూ నదీ గర్భాన్ని తవ్వుతూ వాటిలో బెంటనైట్ మిశ్రమాన్ని పంపాలి. ఆ తర్వాత కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పంపితే బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కాంక్రీట్, ఒకింత బెంటనైట్ మిశ్రమం కలిసి ప్లాస్టిక్ కాంక్రీట్‌గా మారుతుంది. అదే డయాఫ్రం వాల్. గత 40 ఏళ్లుగా డయాఫ్రం వాల్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఈ వాల్ ఎక్కడా విఫలమైన దాఖలాలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment