మరో డయాఫ్రమ్‌ వాల్‌ కట్టాల్సిందే | Another diaphragm wall has to be built | Sakshi
Sakshi News home page

మరో డయాఫ్రమ్‌ వాల్‌ కట్టాల్సిందే

Published Thu, Jul 4 2024 5:30 AM | Last Updated on Thu, Jul 4 2024 5:33 AM

Another diaphragm wall has to be built

ప్రాజెక్టు భద్రత దృష్ట్యా ఇప్పుడున్న దానికి సమాంతరంగా మరొకటి నిర్మించాలి

సీడబ్ల్యూసీ చైర్మన్‌కు సూచించిన అంతర్జాతీయ నిపుణులు

డయాఫ్రమ్‌ వాల్‌కు మరమ్మతులు చేసినా ఫలితం ఉండదు

ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో లీకేజీలను కొంతవరకు అరికట్టవచ్చు

లీకేజీలున్నా డయాఫ్రమ్‌ వాల్, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణానికి ఇబ్బంది ఉండదు

రెండు వారాల్లో సవాళ్లను అధిగమించే విధానం, డిజైన్లపై మధ్యంతర నివేదిక

తాము సూచించిన విధానం మేరకు యాఫ్రి సంస్థ డిజైన్లు ఇవ్వాలి

సీడబ్ల్యూసీ డిజైన్లను ఆమోదించిన అనంతరం వాటి ప్రకారం పనులు చేపట్టాలి

అంతర్జాతీయ నిపుణుల సూచన

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ గ్యాప్‌–2లో గోదవరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌కు సమాంతరంగా కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలని అంతర్జాతీయ నిపుణుల బృందం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి సూచించింది. ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్‌ వాల్‌కు మరమ్మతులు చేసినా, దెబ్బతిన్న ప్రాంతాల్లో ‘యూ’ ఆకారంలో నిర్మించి అనుసంధానం చేసినా పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తుందని చెప్పలేమని తేల్చిచెప్పింది. 

ఇప్పటికే గోదావరి వరదలను మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌తోపాటు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను ప్రభుత్వం పూర్తి చేసినందున కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ను సులభంగా నిర్మించవచ్చని నిపుణుల బృందం అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నియమించిన యూఎస్‌ఏకు చెందిన డేవిడ్‌ బి.పాల్, గియాస్‌ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్‌ డొన్నెళ్లీ, సీస్‌ హించ్‌బెర్గర్, కాంట్రాక్టు సంస్థ మేఘా నియమించిన అంతర్జాతీయ కన్సల్టెంట్‌ యాఫ్రి సంస్థ (స్వీడన్‌) ప్రతినిధులు నాలుగు రోజులపాటు ప్రాజెక్టును పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. 

బుధవారం మరోసారి సమీక్షించిన అనంతరం నిపుణుల బృందంతో సీడబ్ల్యూసీ చైర్మన్‌ వోరా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. గతంలో వరదను మళ్లించేలా స్పిల్‌ వే పూర్తి చేయకుండా, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను చేపట్టి ఇరు వైపులా ఖాళీ వదిలేయడం వల్లే వరద ఉద్ధృతి మరింత పెరిగి డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణులు సీడబ్ల్యూసీ చైర్మన్‌కు తేల్చి చెప్పారు. 

గ్యాప్‌–2లో 1396 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌ వాల్‌ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల మేర దెబ్బతిందని నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) ఇచ్చిన నివేదికతో ఈ బృందం ఏకీభవించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా డయాఫ్రమ్‌ వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించడం శ్రేయస్కరమని సూచించింది.

జెట్‌ గ్రౌటింగ్‌లో లోపం వల్లే లీకేజీలు
ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి ముందు జెట్‌ గ్రౌటింగ్‌ చేసేటప్పుడు ఆ ప్రదేశంలో ఇసుక సాంద్రతను తప్పుగా అంచనా వేశారని ఈ బృందం తెలిపింది. అందువల్లే తక్కువ లోతు నుంచి స్టోన్‌ కాలమ్స్‌ వేసి, జెట్‌ గ్రౌటింగ్‌ చేశారని, దీనివల్లే లీకేజీలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. లీకేజీలకు కారణాలు కనుక్కోవడానికి కాఫర్‌ డ్యామ్‌ పైనుంచి 100 నుంచి 150 మీటర్లకు ఒక చోట మొత్తం 17 చోట్ల బోర్‌ హోల్స్‌ వేసి పరీక్షలు చేయాలని సూచించామని తెలిపింది. 

యాఫ్రి సంస్థ ఇప్పటికే నాలుగు చోట్ల పరీక్షలు చేసిందని వివరించింది. ఆ పరీక్షల ఫలితాలను విశ్లేషిస్తే.. లీకేజీలను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేమని, కొంతవరకు అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. కొంతవరకు లీకేజీలు ఉన్నప్పటికీ కొత్త డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణానికి, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించింది.

ముగిసిన అంతర్జాతీయ నిపుణుల పర్యటన
అంతర్జాతీయ నిపుణుల నాలుగు రోజు­ల పోలవరం పర్యటన బుధవారం ముగిసింది. వారు బుధవారం విజయవాడ చేరుకున్నారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుంచి వారి దేశాలకు వెళ్తారు. 

రెండు వారాల్లో మధ్యంతర నివేదిక
పోలవరం ప్రాజెక్టు పరిశీలన, అధికారు­లతో సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా సవాళ్లను అధిగమించడం, నిర్మాణాల డిజైన్లపై రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇస్తా­మని నిపుణుల బృందం తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థ అంతర్జాతీయ కన్సల్టెంట్‌ యాఫ్రి సంస్థ సవాళ్లను అధిగమించడానికి చేపట్టాల్సిన నిర్మాణాల డిజైన్లను రూపొందించి తమకు పంపితే.. తాము పరిశీలించి మార్పులుంటే సూచిస్తామని చెప్పింది. 

యాఫ్రి, తాము ఏకాభిప్రాయంతో నిర్ణయించిన డిజైన్‌ను సీడబ్ల్యూసీకి పంపుతామని తెలిపింది. ఆ డిజైన్‌ను సీడబ్ల్యూసీ క్షుణ్ణంగా పరిశీలించి, ఆమోదించాకే దాని ప్రకారం పనులు చేపట్టాలని సూచించింది. ఇందుకు సీడబ్ల్యూసీ చైర్మన్‌ వోరా అంగీకరించారు. నిపుణల బృందం మధ్యంతర నివేదిక ఇచ్చాక ఢిల్లీలో మరోసారి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులతో సమావేశం నిర్వహిస్తామని వోరా చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement