కేవీఆర్‌ స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోం | angry kvr land grabbing | Sakshi
Sakshi News home page

కేవీఆర్‌ స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోం

Published Mon, Jun 5 2017 10:21 PM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM

కేవీఆర్‌ స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోం - Sakshi

కేవీఆర్‌ స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోం

 – కొందరి స్వార్థం కోసం పేద విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే సహించం
– అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ బుట్టా రేణుక
– ఎంపీ రాకతో కబ్జా స్థలంలోని పునాదుల్లో మార్పులు
– టౌన్‌ ప్లానింగ్‌ ప్రకారం దగ్గర ఉండి కొలతలు వేయించిన హఫీజ్‌ఖాన్, విద్యార్థి సంఘాల నాయకులు
కర్నూలు సిటీ: రోడ్డు  విస్తరణలో అధికార పార్టీ నేతల మాటలు విని ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదని కర్నూలు పార్లమెంట్‌ సభ్యురాలు బుట్టా రేణుక నగరపాలక సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కోర్టుల్లో స్టే ఉన్నా కేవీఆర్‌ కాలేజీ క్యాంపస్‌ స్థలాన్ని   కబ్జా చేయాలని అధికార పార్టీ నేతల అనుచరులు గోడను కూల్చి వేయడంతో రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ బుట్టారేణుక, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హఫీజ్‌ఖాన్, కేంద్ర పాలక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డితో కలిసి కేవీఆర్‌ కాలేజీకి చేరుకున్నారు.
 
ఈ సందర్భంగా అర్ధరాత్రి గోడను కూల్చివేయడం, తదితర పరిణామాల గురించి హఫీజ్‌ఖాన్, విద్యార్థి సంఘాల నాయకులు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలమ్మ  ఎంపీకి వివరించారు. ఆ తరువాత నగర పాలక సంస్థ కమిషనర్‌ హరినాథ్‌రెడ్డి, ఇతర అధికారులతో ఆమె చర్చించారు. అనుమతులు లేకుండా అర్ధరాత్రి మహిళ కాలేజీ గోడను కూల్చి వేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.  కొందరికి ప్రయోజనం చేకూర్చడ కోసం కాలేజీ స్థలాన్ని ఆక్రమించుకోవడం తగదన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ బుట్టా రేణుక మండిపడ్డారు.
 
గతంలో మాదిరిగా 6 మీటర్ల వరకు  మాత్రమే స్థలాన్ని తీసుకోవాలని ఇంతకు మించి ఎక్కువ తీసుకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ప్రహరీ గోడ కూల్చివేతతో విద్యార్థినులకు రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. టౌన్‌ ప్లానింగ్‌ ప్రకారమే రోడ్లు విస్తరించాలని చెప్పారు. అనంతరం అందుకు సంబంధించిన మ్యాప్‌లు తెప్పించి, ప్రస్తుతం తీసిన పునాదుల నుంచి బయటి వైపునకు 2 మీటర్లు వదిలి గోడ నిర్మాణం జరపాలని సూచించారు. ఇందుకు కమిషనర్‌ హరినాథ్‌రెడ్డి హామీ ఇచా​‍్చరు. అలాగే విద్యార్థినులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం టౌన్‌ ప్లానింగ్‌ ప్రకారం హఫీజ్‌ఖాన్‌ దగ్గర ఉండి కొలతలు వేయించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేందర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అద్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా జనరల్‌ సెక్రటరీ నాగరాజు యాదవ్, నాయకులు రాఘవేంద్రరెడ్డి,  రాజశేఖర్, ట్రేడ్‌ యూనియన్‌ సిటీ నాయకులు కటారీ సురేష్, జాన్, బుజ్జీ, రవి, అశోక్, కుమార్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అనిల్‌కుమార్, రాజు, కిరణ్, సాంబ, ఏసన్న, ప్రవీణ్, లోకేష్, చెన్నప్ప, చంద్రశేఖర్‌గౌడు, తాఫీక్, శీను, విద్యార్థి సంఘాల నాయకులు రంగన్న, చంద్రప్ప, రామకృష్ణ, భాస్కర్, రాజ్‌కుమార్, రమేష్, సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్‌, తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement