మధురవాడ జోన్ – 1లో సిబ్బందిని ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు
మంగళవారం ఉదయం 10.30 గంటల సమయం..గాజువాకలోని జీవీఎంసీ జోన్–5 కార్యాలయంలో అప్పుడప్పుడే కార్యకలాపాలు మొదలవుతున్నాయి. అదే సమయంలో ఒక్కసారిగా పది మంది వ్యక్తులు లోపలికి ప్రవేశించి ఉద్యోగుల నుంచి ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు మొదలుపెట్టారు.అదే సమయానికి.. మధురవాడలోని జోన్–1 కార్యాలయంలోనూ అదే సీన్.అవినీతి ప్లానింగ్‌తో నగరపాలనను గాడి తప్పిస్తున్న జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఏసీబీ డీఎస్పీలు షకీలాభాను, రంగరాజుల ఆధ్వరం్యలో రెండు బృందాలు గాజువాక, మధురవాడ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. రెండు చోట్లా టౌన్ ప్లానింగ్ విభాగాల్లోనే ఈ సోదాలు కేంద్రీకృతం కావడం విశేషం.తనిఖీ బృందాలు ఫైళ్లు, రికార్డులు పరిశీలించడంతో సరిపెట్టకుండా బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ నుంచి చైన్‌మన్ వరకు.. అలాగే ఆ సమయంలో అక్కడ ఉన్న బయటి వ్యక్తులను తరచి తరచి ప్రశ్నించారు. వారిలో కొందరు అనధికార ఉద్యోగులుగా చెలామణీ అవుతున్న విషయాన్ని గుర్తించారు. కాగా మధురవాడ జోనల్ కార్యాలయంలో ఒక అనధికార మహిళా ఉద్యోగి వద్దటౌన్ ప్లానింగ్ సిస్టమ్‌కు చెందిన పాస్‌వర్డ్ ఉన్న విషయం సోదాల్లో వెలుగు చూసింది. బిల్డింగ్ ప్లాన్లకు అనుమతుల జారీలో కొన్ని ఉల్లంఘనలు సైతం ఏసీబీ అదికారులు దృష్టికి వచ్చాయి.
విశాఖపట్నం, మధురవాడ (భీమిలి): భవన నిర్మాణాలకు అనుమతుల మంజూరులో నిబంధనలు తుంగలో తొక్కేయడం... నిర్మాణదారులు నిబంధనలు ఉల్లంఘించినా చూసీచూడనట్లు వ్యవహరించడం... అధ్వానంగా రికార్డుల నిర్వహణ, అనధికార నిర్మాణాలు కట్టడిచేయలేకపోవడం... ఇలా ఒక్కటేమిటి అన్నింటా జీవీఎంసీ జోన్–1 కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సి బ్బంది అవకతవకలకు పాల్పడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏసీబీ అధికారులు తేల్చారు. మధురవాడలోని జోనల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు జెడ్సీ రాము సమక్షంలోను, వేర్వేరుగా స్థానిక అధికారులను ప్రశ్నించారు. అనంతరం బీరువాలు, రికార్డులు పరిశీలించారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం
మంగళవారం సాయంత్రం వరకూ సోదాలు జరుగుతుండగా ప్రాథమిక సమాచారాన్ని డీఎస్పీ రంగరాజు మీడియాకి తెలిపారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంలో, ప్లాన్‌లు అమోదించడంలో జరుగుతున్న అవకతవకలు పరిశీలించాలని రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించినట్టు చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది రికార్డులు సరిగా నిర్వహించడం లేదని తెలిపారు. అనధికార నిర్మాణాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని, పరిశీలించాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదని గుర్తించామన్నారు. ఈ డీవియేషన్స్ టీపీఎస్, టీపీవో, ఏసీపీ... ఇలా అన్ని స్థాయిల్లో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా నాన్ ఏజెన్సీ అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డ్ రికార్డుల నిర్వహణ, టీడీఆర్ ఇవ్వడం వంటి వాటిలో అవకతవకలు జరిగినట్టు గుర్తించామని తెలిపారు. అలాగే ఇక్కడ అత్యంత రహస్యంగా ఏసీపీ మాత్రమే ఉపయోగించాల్సిన డాంగిల్, పాస్‌వర్డ్ ఓ అనధికార మహిళకు అప్పగించి పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. చివరకు అత్యంత ముఖ్యమైన ఆర్‌టీఐ రిజిస్టర్ కూడా సక్రమంగా నిర్వహించలేదని చెప్పారు. ఆరిలోవ ఇందిరానగర్‌లో ఓ భవనంలో మూడు ప్లాట్‌ల నిర్మాణానికి అనుమతి తీసుకుని 8 ప్లాట్స్ నిర్మిస్తున్నట్టు ప్రాథమిక నిర్థారణకు వచ్చామని, దానిపై కూడా విచారణ సాగుతుందని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు సిఫార్స్ చేస్తామని తెలిపారు. ఇన్‌స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఆఫీసులో, మరో ఇన్‌స్పెక్టర్ అప్పారావు ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో విచారణ సాగిస్తున్నామని తెలిపారు.
జోన్–5లోనూ విస్తృత సోదాలు
గాజువాక: జీవీఎంసీ జోన్ – 5 (గాజువాక జోన్) కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు, సిబ్బంది మంగళవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఒక్కసారిగా పది మంది ప్రవేశించి విభాగంలోని ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు విచారణ కొనసాగించారు. ఏసీబీ అడిషినల్ ఎస్పీ షకీలాభాను, సీఐ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన అధికారులు టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించారు. వివిధ ఫైళ్లకు సంబంధించిన అనుమతుల్లో చోటుచేసుకున్న జాప్యంపై విభాగం అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సహాయ ప్లానింగ్ అధికారి అమర్‌నాథ్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు వెంకటరావు, గోపన్నలను వివిధ అంశాలపై విచారించారు. గుమస్తాలను విచారించడంతోపాటు వారి వద్ద ఉన్న నగదు సైతం పరిశీలించారు. అనంతరం ఆ వివరాలను నమోదు చేశారు.
విభాగంలో అనధికారికంగా పని చేస్తున్న వ్యక్తుల వివరాలు సేకరించారు. విభాగంలో అప్పటికే ఉన్న బయటి వ్యక్తులను ప్రశ్నించారు. సమస్యలుంటే తమతో చెప్పాలని ఏసీబీ అధికారులు కోరడంతో పలువురు తమ సమస్యలను వివరించారు. అనంతరం జోన్‌లో చోటు చేసుకొంటున్న అనధికార నిర్మాణాలపై చైన్‌మ్యాన్‌లను ప్రశించారు. పలు వార్డుల్లో పర్యటించి వివిధ భవన నిర్మాణాలను పరిశీలించారు. జోనల్ కమిషనర్ డి.శ్రీధర్ నుంచి పలు వివరాలు సేకరించారు. టౌన్‌ప్లానింగ్ సిబ్బంది హాజరు, సర్వీస్ రిజిస్టర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అడిషినల్ ఎస్పీ షకీలాభాను మాట్లాడుతూ అనధికార వ్యక్తుల నుంచి రూ.29వేలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కార్యాలయం పరిధిలో పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇద్దరు అనధికార కంప్యూటర్ ఆపరేటర్లు కార్యాలయంలో పనిచేస్తున్నట్టు గుర్తించామని తెలిపారు.
ఫిర్యాదుల ఆధారంగా దాడులు
టౌన్‌ప్లానింగ్ విభాగంపై ఏసీబీకి వరుసగా అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. గాజువాక జోన్‌లో ఈ ఫిర్యాదులు మరింత వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇవ్వనిదే భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలేదని, అనధికారిక నిర్మాణాల్లో చైన్‌మ్యాన్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని, డబ్బులు వసూలు చేసి అనుమతిస్తున్నారన్న ఆరోపణలు, ఫిర్యాదులు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ అంశాలపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment