ఓటు హక్కుపై విద్యార్థులతో ముఖాముఖి
ఓటు హక్కుపై విద్యార్థులతో ముఖాముఖి
Published Mon, Jan 16 2017 11:55 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
- ఈ నెల 18 నుంచి 23 వరకు కార్యక్రమం
- జిల్లా కలెక్టర్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): ఓటు హక్కుపై విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. సోమవారం ఈఆర్‌ఓలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. దృఢమైన ప్రజాస్వామ్యం ఏర్పడాలంటే ఓటు హక్కుపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో నాలుగు హైస్కూళ్లు, నాలుగు జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలను ప్రత్యేక నమూనాలో నమోదు చేసి ఈ నెల 23వ తేదీలోపు డీఆర్‌ఓకు పంపాలన్నారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులకు క్విజ్, వ్యాస రచన పోటీలు నిర్వహించాలని సూచించారు. జిల్లా స్థాయిలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్నికల సెల్ అధికారులపై ఆగ్రహం...
సమావేశానికి తగిన వివరాలు తీసుకురాకపోవడంతో ఎన్నికల సెల్ అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ ఏమి చేస్తున్నారు. సరైన వివరాలతో రాకపోతే ఎలా.. ఇంత అధ్వానంగా సమావేశానికి వస్తారా... మీకు జీతం ఎందుకివ్వాలి’’ అంటూ మండిపడ్డారు. వివరాలు మెయిల్‌లో పెట్టి చేతులు దులుపుకుంటావా..అంటూ ఎన్నికల సెల్ డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement