సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద సివిల్స్‌లో ఉచిత కోచింగ్ ఇప్పించేందుకు అభ్యర్థుల ఎంపికలో కటాఫ్ మార్కులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు కటాఫ్ మార్కులు లేకుండా ఆయా సంక్షేమ శాఖలు నిర్ణయించిన ప్రకారం టార్గెట్ వరకు మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల నుంచి మొత్తం 3,850 మందిని ఎంపిక చేయాల్సి ఉంది. కోచింగ్ కోసం మూడు నెలల క్రితం ఎంట్రెన్స్ పరీక్ష రాశారు. పరీక్ష రాసిన నెల రోజుల తరువాత ఫలితాలు ప్రకటించారు. అయితే రెండు నెలలుగా ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు.
కటాఫ్ మార్కులపై తేల్చని ప్రభుత్వం..
మొత్తం 150 మార్కులకు పరీక్ష పెట్టారు. ఇందులో ఎన్ని మార్కుల వరకు కటాఫ్ పెట్టాలనే విషయంలో ప్రభుత్వం తేల్చుకోలేకపోతున్నది. దాదాపు 95శాతం మందికి వందలోపు మార్కులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సివిల్స్‌కు కోచింగ్ తీసుకునే వారు 80 శాతం మార్కులతో ఎంట్రెన్స్ పాస్ అయితే ఆలోచించవచ్చునని, అలా కాకుండా 50 శాతం లోపు మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేస్తే ఫలితాలు రావడం లేదనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద కోచింగ్ కోసం ప్రభుత్వం కోచింగ్ సెంటర్‌లకు తొమ్మిది నెలలకు కలిపి సుమారు రూ. 40 కోట్లు ఖర్చుచేస్తున్నది. అందుకని కటాఫ్ కనీస మార్కులు ఎంత పెట్టాలనే విషయం తేల్చుకోలేకపోతున్నది. దీనిపై ఈనెల 26న సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో అన్ని సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనూ ఎటూ తేల్చలేదు. ఇప్పటికే రెండు నెలల నుంచి పరీక్షలు రాసిన 45,447 మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్..
మహిళలకు 33 శాతం రిజర్వేషన్, దివ్యాంగులకు 0.3శాతం రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సి ఉంది. దీనిపైనా కసరత్తు జరుగుతోంది. గత సంవత్సరం బీసీలకు మహిళా రిజర్వేషన్, కటాఫ్ మార్కులు అమలు చేయాలనుకుంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చివర్లో ఆ ప్రతిపాదన విరమించుకొని మెరిట్ ప్రకారం ఇచ్చారు.
సివిల్స్‌కు ఎంపిక కావడం లేదని..
సివిల్స్‌లో ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా.. తగిన ఫలితాలు రావడం లేదు. మూడు సంవత్సరాలుగా సంవత్సరానికి 3,850 మందికి కోచింగ్ ఇప్పిస్తున్నా ఒక్కరు కూడా ఎంపిక కాలేదు. అందువల్ల కటాఫ్ మార్కుల అంశం తెరపైకి వచ్చింది.
రెండు నెలలుగా ఎదురు చూపులు
సివిల్స్ శిక్షణకు ఎంట్రెన్స్ ఫలితాలు ప్రకటించి రెండు నెలలైనా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటి నుంచి కోచింగ్ ప్రారంభిస్తారో వెల్లడించలేదు. సరైన శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్‌ను ఎంపిక చేసి విద్యార్థులను అందులో చేర్పించాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం ఆయా సంక్షేమ శాఖల నుంచి ఉన్నతాధికారులతో కమిటీలు వేసి దేశ వ్యాప్తంగా పంపించి రిపోర్టులు తెప్పించింది. రిపోర్టు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వద్ద ఉంది. ఇంకా ఈ రిపోర్టుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment