శిక్షణ ‘క్యూ’ | Learning 'queue' | Sakshi
Sakshi News home page

శిక్షణ ‘క్యూ’

Published Tue, Sep 30 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

శిక్షణ ‘క్యూ’

శిక్షణ ‘క్యూ’

  • లక్ష ఉద్యోగాలు వస్తాయని సంతోషం
  • కోచింగ్ సెంటర్‌లకు పోటెత్తుతున్న అభ్యర్థులు
  • కొత్త రాష్ట్రంలో ఉద్యోగాలపై కోటి ఆశలు
  • ఫంక్షన్ హాళ్లకు మారిన తరగతి గదులు
  • సాక్షి, సిటీబ్యూరో/ముషీరాబాద్: హైదరాబాద్ ఆశావహుల కేంద్రంగా మారింది. ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న వేలాది మంది నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు కోచింగ్ సెంటర్‌లకు పోటెత్తుతున్నారు. ఒకటి, రెండు నెలల్లో సుమారు లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు వెలువడవచ్చునన్న వార్తల నేపథ్యంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నిరుద్యోగ అభ్యర్ధులు భారీ సంఖ్యలో నగరానికి తరలిస్తున్నారు. దీంతో గ్రూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్‌లు కళకళలాడుతున్నాయి.

    కోచింగ్ సెంటర్‌లకు నెలవైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో పంక్షన్ హాళ్లు తరగతి గదులుగా మారాయి. ఒక్కొక్క సెంటర్‌లో వేలాది మంది శిక్షణ కోసం పేర్లు నమోదు చేసుకోవడంతో నిర్వాహకులు తరగతి గదులను పంక్షన్ హాళ్లలోకి మార్చారు. ఈ ప్రాంతాల్లోని అన్ని  ఫంక్షన్ హాళ్లు మరో 6  నెలల వరకు కోచింగ్ సెంటర్‌ల కోసమే బుక్ అయ్యాయి. కొన్ని చోట్ల  కమ్యూనిటీ హాళ్లు, సాంస్కృతిక కేంద్రాలు సైతం కోచింగ్ కేంద్రాలకు వేదికలవుతున్నాయి.

    కళలకు, సాంస్కృతిక ప్రదర్శనలకు కేంద్రమైన త్యాగరాయ గానసభ సైతం కోచింగ్ సెంటర్‌గా మారింది. అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభ్యర్థులకు శిక్షణనిచ్చేందుకు ఓ  విద్యా సంస్థ 6 నెలల పాటు బుక్ చేసుకుంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ చుట్టూ ఉన్న  ఫంక్షన్ హాళ్లు కోచింగ్‌లకు వచ్చే అభ్యర్ధులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కొక్క తరగతిలో 1000 నుంచి  1500 మంది విద్యార్థులకు ఒకేసారి బోధిస్తున్నారు.  
     
    బంగారు భవిత కోసం నిరీక్షణ

    తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కోటి ఆశలతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ నాటికి వరుసగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఉపాధ్యాయ నియామకాలు, పోలీసు కానిస్టేబుళ్ల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా  కోచింగ్ సెంటర్‌లకు డిమాండ్ పెరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్‌నగర్, తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఉన్న  కోచింగ్ సెంటర్‌లలో సుమారు 50 వేల మంది శిక్షణ పొందుతున్నట్లు సమాచారం.

    రెండు రోజుల క్రితం అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో 1200 మందితో కొత్త బ్యాచ్‌ను ప్రారంభిం చేందుకు దర ఖాస్తులు విక్రయించగా, 4 వేల మందికి పై గా పోటీ పడ్డారు. దరఖాస్తుల కోసం అశోక్‌నగర్ చౌరస్తా నుంచి ఇందిరా పార్కు వరకు బారులు తీరారు. అభ్యర్థుల తాకిడితో కొన్ని కోచింగ్ సెంటర్లు శిక్షణ కాలాన్ని 3 నుంచి  4 నెలలకు కుదిస్తున్నాయి. సాధారణంగా కరెంట్ అఫైర్స్, మెం టల్ ఎబిలిటీ, పాలిటీ, తదితర అంశాలలో ఆరు నెలల శిక్షణతో పాటు, స్టడీ మెటీరియల్‌ను అందించే శిక్షణ  సంస్థ లు డిమాండ్ దృష్ట్యా  స్టడీ మెటీరియల్‌ను అందజేయలేకపోతున్నాయి. వారం రోజుల్లో ప్రస్తుత బ్యాచ్‌లను ముగించి, కొత్త బ్యాచ్‌ల కోసం కోచింగ్ సెంటర్‌లు సన్నద్ధమవుతున్నాయి.
     
    ఉద్యోగం వదులుకొని వచ్చాను  
    గచ్చిబౌలీలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. త్వరలో ప్రభుత్వ  ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు వస్తాయనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చాను. ఎలాగైనా సరే గ్రూప్-2 సాధించాలనే పట్టుదలతో ఉన్నాను.    
    -  బాలకృష్ణ, ఎంబీఏ, మెదక్
     
    ఆడపిల్లలకు మంచి అవకాశం
    కొత్త రాష్ట్రంలో ఎలాగైనా ఉద్యోగా లు వస్తాయనే నమ్మకం ఉంది. ము ఖ్యంగా అమ్మాయిలకు ఇది మంచి అవకాశం. ఎంటెక్ చదువుతున్నాను. ప్రైవేట్ ఉద్యోగాల కంటే  ప్రభుత్వ ఉద్యోగాల్లోనే మంచి భవిష్యత్తు ఉంటుందని  పట్టుదలగా చదువుతున్నాను.             
    - వనిత, ఎంటెక్, నల్లగొండ
     
    లక్ష ఉద్యోగాల పైనే ఆశలు
    లక్ష ఉద్యోగాలొస్తాయనే వార్తలు ఎంతో ఆశ కలిగిస్తున్నాయి. కష్టపడి చదివితే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంది. కోచింగ్ తీసుకోవడం వల్ల మరింత అవగాహన పెరుగుతుంది.        
    - సోమేష్, పీజీ, నల్లగొండ
     
    నమోదు కేంద్రాల్లోనూ రద్దీ..

    హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్‌లకు ఉద్యోగార్థులు తరలి వస్తున్నారు. వివిధ  ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం పేర్లు నమోదు చేసుకుంటున్నారు. దీంతో మెహిదీపట్నంలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధి కల్పన కార్యాలయాల వద్ద రద్దీ బాగా పెరిగింది. ఈ ఏడాదిలోనే  ఉద్యోగార్ధులు భారీ  సంఖ్యలో తరలివచ్చినట్లు అధికారులు చె ప్పారు. తె లంగాణ ఆవిర్భావం తరువాత ఉద్యోగాలపై అందరిలోనూ ఆశలు పెరిగాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 29వ వరకు హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 12,204 మంది, రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 18,021 మంది పేర్లు నమోదు చేసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement