UPSC Result 2023: Narayanpet SP Daughter Uma Harathi Got All India 3rd Rank In Civils - Sakshi
Sakshi News home page

UPSC Result 2023: కోచింగ్‌ నచ్చలేదు.. ఇంటిలోనే.. ఇంటర్నెట్‌లో శోధిస్తూ..

Published Wed, May 24 2023 10:13 AM | Last Updated on Wed, May 24 2023 12:50 PM

SP Daughter Uma Harathi Got All India 3rd Rank In Civils - Sakshi

నారాయణపేట/హుజూర్‌నగర్‌: ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు సార్లు యూపీఎస్సీ రాసినా ర్యాంకు రాలేదు. అయినా ఆమె నిరాశ చెందలేదు. ఐదోసారి సైతం పట్టుదలతో ప్రయత్నించి ఏకంగా ఆలిండియా 3వ ర్యాంకు సాధించింది. ఆమెనే నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు, శ్రీదేవిల కుమార్తె నూకల ఉమాహారతి. హైదరాబాద్‌లో 2010లో 9.8 జీపీఏతో టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించిన ఉమాహారతి... 2012లో ఇంటర్‌ ఎంపీసీలో 955 మార్కులు సాధించారు.

ఆపై 2017లో ఐఐటీ హైదరాబాద్‌ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్‌. వెంకటేశ్వర్లుది సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందినవారు. యూపీఎస్సీ 2020లో నిర్వహించిన ఐఈఎస్‌లో ఆమె తమ్ముడు సాయి వికాస్‌ 12వ ర్యాంకు సాధించారు. రెండేళ్ల శిక్షణ అనంతరం సోమవారమే ముంబైలోని సీపీడబ్ల్యూడీలో ఐఈఎస్‌గా విధుల్లో చేరగా ఆ మర్నాడే అక్క ఉమాహారతి సివిల్స్‌లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌ కానుండటం విశేషం. సివిల్స్‌లో ర్యాంకు సందర్భంగా ఉమాహారతితో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ ఆమె మాటల్లోనే.. 

గత సివిల్స్‌ పేపర్లూ చదివా... 
సివిల్‌ ఇంజనీరింగ్‌ తర్వాత ఉద్యోగం బదులు సివిల్స్‌వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఢిల్లీలోని వాజీరావు కోచింగ్‌ సెంటర్‌లో 2018–19లో శిక్షణ పొందినప్పటికీ అక్కడి కోచింగ్‌ నచ్చలేదు. ఇంటికొచ్చి ఆప్షనల్‌ సబ్జెక్టు అంథ్రోపాలజీతోపాటు కామన్‌ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై ఇంటర్నెట్‌లో స్టడీ మెటీరియల్‌ సెర్చ్‌ చేశా. గత సివిల్‌ పేపర్లనూ చదివా. దేశ, అంతర్జాతీయ ఆంశాలు, సంఘటనలపై నిత్యం ఆంగ్ల దినపత్రికలు చదివేదాన్ని ఈ ఏడాదంతా నాన్న, అమ్మతో నారాయణపేటలో ఉండి చదివా. సివిల్స్‌ సాధించా. ఈసారి 2,500 ర్యాంకుల్లో ఏదో ఒకటి వస్తుందనుకున్నా. మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. 

విఫలమైనా తమ్ముడు వెన్నుతట్టాడు...  
ఐపీఎస్‌ అధికారి అయిన మా నాన్న వెంకటేశ్వర్లు నుంచే స్ఫూర్తి పొందా. తమ్ముడు సాయి వికాస్‌ను ఆదర్శంగా తీసుకున్నా. గత ప్రయత్నాల్లో నాలుగుసార్లు విఫలమైనా బాధపడొద్దని తమ్ముడు అండగా నిలిచాడు. స్నేహితులు నిఖిల్, అంకితల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement