అది తేలాకే సివిల్స్ ఫలితాలు
న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత ప్రభుత్వ సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్వంటి హోదాలకు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షల మెయిన్స్ ఫలితాలు మరింత ఆలస్యమయ్యేలా ఉంది. జాట్ల అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించిన తర్వాతే ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జాట్లకు కూడా ప్రత్యేక రిజర్వేషన్ కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి ఆ రిజర్వేషన్ వర్తించేలా అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ హయాంలోని యూపీఏ ప్రభుత్వం అదర్ బ్యాక్వార్డ్ క్లాస్ (ఓబీసీలు) జాబితాలో జాట్లను చేర్చింది. అయితే దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా జాట్లకు ఓబీసీల ద్వారా రిజర్వేషన్ వర్తింపచేసేందుకు కేంద్రం ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, ఆ తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా కేంద్రం మరోసారి పిటిషన్ వేసింది. దీంతో మెయిన్స్ ఫలితాల వెల్లడిపై జాప్యం నెలకొంది. కోర్టు తుది తీర్పు తర్వాతే ఫలితాలు వెల్లడించాలని యూపీఎస్సీ భావిస్తోంది.