ఉద్యమంలా ‘మిషన్ కాకతీయ’
పట్టణ ప్రాంతాల్లో మినీ ట్యాంక్‌బండ్‌లు
విపక్షాలను కలుపుకొనిపోతాం: మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చేపట్టిన‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళతామని శుక్రవారం శాసనమండలిలో నీటిపారుదల, శాసనసభవ్యవహారాల శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. భూగర్భజలాలను పెంచడంతో పాటు వ్యవసాయానికి నీరందించే ఈ కార్యక్రమంలో విపక్షాలను కూడా కలుపుకుపోతామన్నారు. అంతేకాక కవులు, కళాకారులను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. మండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘చెరువుల పరిరక్షణ గురించి ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాలకు, పాఠకులు రాసిన లేఖలకు స్పందించిన ప్రభుత్వం వాటి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని’ చెప్పారు.
చెరువుల పునరుద్ధరణ వలన ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వివిధ కుల వృత్తుల వారికి జీవనోపాధి లభిస్తుందన్నారు. చెరువుగట్లపై ఈత, తాటి చెట్లు పెంచడం వలన గీత కార్మికులకు ఉపయోగపడతాయన్నారు. మిషన్ కాకతీయ ప్రారంభం రోజున ముఖ్యమంత్రి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ కనీసం గంటపాటు శ్రమదానం చేయనున్నారని మంత్రి తెలిపారు. గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణతో పాటు, పట్టణాల్లోని చెరువులను కూడా పటిష్టం చేస్తామని మంత్రి చెప్పారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పట్టణ చెరువును మినీ ట్యాంక్‌బండ్ మాదిరిగా తీర్చిదిద్దుతామన్నారు. చెరువులను పరిరక్షించేందుకు సోషల్ ఫెన్సింగ్ పేరిట కాలనీవాసులకు బాధ్యతను అప్పగిస్తామన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రత్యేకంగా లేక్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్‌లోగా టెండర్లు పిలిచి డిసెంబర్ రెండో వారం నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు.