చెరువు మట్టితో నిర్మించిన కట్ట రివిట్‌మెంట్
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్‌ల పనులు అస్తవ్యస్తంగా మారాయి. సకాలంలో పనులు పూర్తికాకపోగా.. నాసిరకంగా ఉంటున్నాయి. అందుకు మోత్కూరు పెద్ద చెరువు పనులే నిదర్శనం. చెరువుకట్ట, రివిట్‌మెంట్ అస్తవ్యస్తంగా ఉండి కాంట్రాక్టర్ అలసత్వాన్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మరో వైపు మెట్‌చిప్స్, విద్యుత్ స్తంభాలు ఆగమాగంగా ఉన్నాయి. మే 31తో కాంట్రాక్ట్ గడువు ముగిసినా పనులు పూర్తికాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
మోత్కూరు : ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.అందులో భాగంగా జిల్లాలోని మోత్కూరు చెరువును కూడా అధికారులు ఎంపిక చేశారు. మిషన్ కాకతీయ రెండో దశలో ప్రభుత్వం రూ.6.83కోట్ల నిధులు మంజూరు చేసింది. 2017 మే16వ తేదీన రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు విద్యుత్‌శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు.
2016 జూలై 26న అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టర్.. మే 31వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ, గడువు ముగిసినా పూర్తి కాలేదు. చేపట్టిన పనులు కూడా అస్తవ్యస్తంగా, నాణ్యత లోపించి ఉన్నాయి.
చేపట్టాల్సిన పనులు ఏమంటే..
పాత చెరువుకట్ట వెడల్పు 5 మీటర్లు ఉండగా 12 మీటర్లకు పెంచాలి. కట్ట ప్ర«ధాన రహదారి కావడంతో బీటీ రోడ్డు వేసి ఇరువైపులా విద్యుత్ లైటింగ్, రేలింగ్ ఏర్పాటు చేయాలి. చెరువు కట్టకు లోపలి భాగంలో రాతి కట్ట (రివిట్‌మెంట్)నిర్మించాలి. పార్క్, వాకింగ్ ట్రాక్, మూడు విజిట్ వ్యూ పాయింట్లు, మూడు బతుకమ్మ గాట్లు ఏర్పాటు చేయాలి. బృందావన్ కాల్వ ఫీడర్‌చానల్ అలుగు వద్ద సీసీ, బ్రిడ్జి, ఎఫ్‌టీఎల్ లెవల్ చెరువు చుట్టూ ఆరు మీటర్ల వెడల్పుతో కట్ట పోయాల్సి ఉంది. కట్టకు ఉత్తరం వైపున ఉన్న వ్యవసాయ బావికి రివైండింగ్ వాల్ (సీసీ రోడ్డు) ఏర్పాటు చేయాలి.
పాటించని ప్రమాణాలు.. ఆగమాగంగా పనులు!
గడువులోగా పూర్తి చేయాల్సిన పనులు ఆగుతూ సా..గుతూ నడుస్తున్నాయి. పైగా నాసిరకంగా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండడం.. పనులు జరిగిన తీరు చూస్తుంటే తేటతెల్లమవుతోంది. రివిట్‌మెంట్ చేసే కట్టలోపలి భాగంతోపాటు కట్ట రహదారి విస్తరణకు చెరువు మట్టినే వినియోగించారు. అంతేకాకుండా కట్టపై బీటీ రోడ్డు పనులు అధ్వానంగా ఉన్నాయి. వాటర్ క్యూరింగ్‌తో రోలింగ్ చేయించకపోవడంతో అప్పుడే రోడ్డుపై కంకరలేచింది.
అదే విధంగా మెట్ చిఫ్స్ అస్తవ్యస్తంగా వేశారు. ఓ వైపు మెటల్ చిప్స్ వేసి మరోవైపు వేయకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పాపతకట్టపై అంతరాయంగా ఉన్న కరెంట్ స్తంభాలను తొలగించలేదు. ప్రస్తుతం స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా ఉన్నాయి. 10 కరెంట్ స్తంభాలు వృథాగా ఉన్నాయి. గతంలో చెరువుకట్టపై ఉన్న ప్రధాన రహదారిపై అలుగునీరు ప్రవహిస్తూ ఉండేది. అక్కడ సిమెంట్ గూనలు వేసి తాత్కాలికంగా మరమతులు వేశారు.
అలుగు సమీపంలో రహదారిపై బ్రిడ్జి నిర్మాంచాల్సి ఉండగా ఆర్‌అండ్‌బీ ఇరిగేషన్ శాఖల సమన్వయ లోపంతో ఇప్పటి వరకు బ్రిడ్జి పనులకు నోచుకోవడం లేదు. అసలు బ్రిడ్జి నిర్మిస్తారా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.10 కోట్లకు పెంచి నిధులు
ఇదిలా ఉండగా మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.6.83కోట్లు మంజూరు చేసింది. కాగా అధనంగా నిధులు కావాలని స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పనుల శంకుస్థాపనకు వచ్చిన మంత్రి హరీశ్‌రావును కోరారు. అందుకు మంత్రి స్పందిస్తూ నిధులు పెంచుతున్నట్లు వేదికపై ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment