మొదటిదశ చెరువు పనులు మార్చి నాటికి పూర్తి
అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మొదటి దశ మిషన్ కాకతీయలో భాగంగా కోటి రూపాయల కంటే తక్కువగా ఉన్న చెరువు పనులను 2016 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రూ.కోటికి పైన ఉన్న పనులను జూన్ 30 నాటికి పూర్తి చేయాలన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సాగుతున్న మిషన్ కాకతీయ పనులపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి దశ పనుల్లో అలసత్వం వహిస్తున్న ఏజెన్సీలపట్ల కఠినంగా వ్యవహరించాలని, పనిచేయని వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని, అవసరమైతే తొలగించాలని ఆదేశించారు.
ప్రతి నియోజకవర్గానికి కేవలం ఒక మినీ ట్యాంక్‌బండ్‌ను మాత్రమే నిర్మించాలని సూచించారు. ఇటీవల చాలామంది చిన్నారులు ఈత కోసం వెళ్లి చెరువుల్లో మృత్యువాత పడుతున్నారని, ఇలాంటి ఘటనలు జరగకుండా లోతైన ప్రాంతాలను పూడ్చాలని అధికారులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 46 చెరువు పనులకు యుద్ధప్రాతిపదికన టెండర్లు పిలవాలన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో ఎక్కడైనా లోపాలు కనిపిస్తే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.