సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు దీటుగా ఉత్తర తెలంగాణలోని ప్రధాన నగరమైన వరంగల్‌ను తీర్చిదిద్దాలని, వరంగల్ అభివృద్ధి నమూనాను పార్టీ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ప్రతిపాదనలు సిద్ధమవుతున్నా యి. మౌలిక వసతుల కల్పనతోపాటు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందేలా వరంగల్‌కి ప్రాధాన్యమిచ్చేలా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్టు సమాచారం.
వరంగల్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం నగరాలను కూడా ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేయాలనికూడా కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ 3 నగరాల్లో ఎక్స్‌ప్రెస్‌వేలను ఏర్పాటు చేయడం, ఐటీ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేలా ప్రాధాన్యతనివ్వడం లాంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చనుంది. దీంతోపాటు రాష్ట్రంలోని కౌలురైతులకు 2011లో ఇచ్చిన విధంగా మళ్లీ గుర్తింపు కార్డులిచ్చే ప్రతిపాదనపైనా మేనిఫెస్టో కమిటీ తీవ్ర కసరత్తే చేస్తోంది. పర్యాటకరంగం అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.
ముగిసిన గడువు
కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి వినతులు వెల్లువలా వచ్చాయి. గత 10–12 రోజులుగా ఈ కమిటీకి వివిధ రంగాల్లోని సమస్యల పరిష్కారం కోరుతూ, తమ తమ సమస్యలను మేనిఫెస్టోలో ప్రస్తావించాలంటూ 2,500 వరకు వినతులు వచ్చాయని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క సోమవారం రోజే 200 వరకు విజ్ఞాపనలు వచ్చినట్టు సమాచారం. మేనిఫెస్టో కమిటీకి దరఖాస్తులు సమర్పించే గడువు సోమవారంతో ముగిసిందని దామోదర రాజ నర్సింహ వెల్లడించారు.
ఇప్పటివరకు వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తులపై కమిటీ సమీక్ష, అధ్యయనం జరుపుతోందని ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వెల్లడించారు. నేటి నుంచి మేనిఫెస్టో కమిటీ నియమించిన సబ్‌కమిటీల వారీగా భేటీలుంటాయని వెల్లడించారు. మంగళవారం కిసాన్‌సెల్ సబ్‌కమిటీ భేటీ అయి వ్యవసాయ రంగానికి సంబంధించి మేనిఫెస్టోలో పెట్టాల్సిన అం శాలపై చర్చించనుంది. ఈ నెల 10న మరో సమావేశం అనంతరం పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను అం దించనుంది.
కాగా, చివరి దరఖాస్తును మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజనర్సింహకు అందజేశారు. వారం రోజుల్లోగా కాంగ్రెస్ మేనిఫెస్టోకు తుదిరూపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, మేనిఫెస్టో కమిటీకి పలు విజ్ఞప్తులతో కూడిన దరఖాస్తును అందజేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రైతులకు వడ్డీలేని రుణాలి ప్పించాలని, ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని కోరినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment