
ఎయిర్‌పోర్టుకు మహర్దశ
- మాస్టర్‌ప్లాన్‌కు ప్రతిపాదనలు పూర్తి
- మూడు దశల్లో అభివృద్ధికి ప్రణాళికలు
- ఫైల్‌ను ఢిల్లీకి పంపిన అధికారులు
- రన్‌వే విస్తరణ, టెర్మినల్ భవనాలే కీలకం
- ప్రహరీ నిర్మాణానికి భూసార పరీక్షలు
సాక్షి, విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని కేంద్ర విమానయాన శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు నూతన మాస్టర్‌ప్లాన్‌కు ప్రతిపాదనలు రూపొందించారు. దానికి అనుగుణంగా ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. మాస్టర్‌ప్లాన్‌లోని ప్రతిపాదనలను అధికారులు ఢిల్లీకి పంపారు.
కేంద్రం అనుమతి రాగానే ఆరు నెలల వ్యవధిలో మాస్టర్ ప్లాన్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేసే అవకాశం ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఎయిర్‌పోర్ట్ డెరైక్టర్‌గా రాజ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి రివైజ్డ్ ప్లాన్ తయారుచేశారు. ప్రస్తుతం ఈ ప్లాన్ అమలులో ఉంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం విమాన సర్వీసుల రద్దీ పెరిగింది. గన్నవరం నుంచి రోజూ 10 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం 80 శాతంపైనే ఆక్యుపెన్సీ ఉంటోంది.
రాష్ట్ర విభజన తర్వాత పెరిగిన ప్రాధాన్యత
రాష్ట్ర విభజన నేపథ్యంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రాధాన్యత పెరిగింది. దీనికి అనుగుణంగా ఇక్కడి అధికారులు తరచూ పలు ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై అందరి దృష్టి నెలకొంది. ప్రస్తుతం ఉన్న రన్ వే, టెర్మినల్ భవనం దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సరిపోవని అధికారులు తేల్చారు.
ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. మూడు నెలల క్రితం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ముఖ్య అధికారులు గన్నవరంలో పర్యటించి అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలించారు. సీఎం చంద్రబాబు కూడా ఇటీవల గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అధికారుల ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుందని భావిస్తున్నారు.
మూడు దశల్లో అభివృద్ధి
ప్రధానంగా మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనల్లో పేర్కొన్న అంశాలను మూడు దశల్లో అభివృద్ధి చేస్తారు. టెర్మినల్ బిల్డింగ్స్, ఆపరేషన్స్, సిటీ సెక్టార్లుగా విభజించి మూడు దశల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 7,500 అడుగుల రన్‌వే ఉంది. టెర్మినల్ బిల్డింగ్‌లో సీటింగ్ కెపాసిటీ 250 మాత్రమే. ఈక్రమంలో మొదటి దశలో టెర్మినల్ భవనాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సుమారు 1,500 సీటింగ్ సామర్థ్యంతో టెర్మినల్ భవనం నిర్మించాలని మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
దీనిలో జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. వివిధ ఎయిర్‌లైన్ కంపెనీలకు గదులు కేటాయించడానికి వీలుగా టెర్మినల్ భవనంలో ప్రత్యేకంగా కొంతభాగం ఉండాలని మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్నారు. ఇదే తరహాలో ఇతర అవసరాల కోసం కూడా కొంత స్థలం కేటాయించాలని నిర్ణయించారు.
రెండో దశలో ఆపరేషన్స్‌లో కీలకమైన రన్ వేను విస్తరిస్తారు. రన్ వేను 12వేల నుంచి 15వేల అడుగులకు పెంచాలని ప్రతిపాదనలు రూపొందించారు. విమానాల పార్కింగ్ కోసం కొంత ప్రదేశం కేటాయించాలని నిర్ణయించారు. సిటీ సెక్టార్‌లో భాగంగా మూడో దశలో నగరానికి ఎయిర్‌పోర్టు ఎంత దూరంలో ఉందనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ఉన్న ఇన్ గేట్, అవుట్ గేట్‌లను మార్చడం, జాతీయ రహదారికి కనెక్టివిటీ ఉండేలా చూడటం వంటి అంశాలను ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
ప్రహరీ కోసం పరీక్షలు
మాస్టర్‌ప్లాన్ పనులతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఉన్న ప్రహరీ స్థానంలో నూతనంగా భారీ రక్షణ గోడ నిర్మించటానికి కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు గత వారంలో భూసార పరీక్షలు నిర్వహించారు. ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడిన వెంటనే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని ఎయిర్‌పోర్ట్ డెరైక్టర్ రాజ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. దీనికి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉందని చెప్పారు.