కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణ మాస్టర్‌ప్లాన్ ముసాయిదా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముసాయిదాకు వ్యతిరేకంగా నెల రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు గురువారం తమ కుటుంబ సభ్యులతో కలిసి ‘రైతు కుటుంబ సమేత ర్యాలీ’చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. రైతులు భారీగా తరలివస్తుండటంతో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. అయితే పోలీసులను దాటుకుని రైతులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు.
పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోపులాటలో ఐదుగురు రైతులు గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఏఎస్‌పీ అనోన్య, డీఎస్పీ సోమనాథం తమతో దురుసుగా మాట్లాడారంటూ రైతులు మండిపడ్డారు. కొందరు రైతులు, మహిళా రైతులు.. పోలీసులపైకి చెప్పులు విసిరారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ధర్నా కార్యక్రమం కొనసాగింది. కలెక్టర్ జితేష్ వి పాటిల్ బయటకు వచ్చి తమ గోడు వినాలని, వెంటనే మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కలెక్టర్ బయటకు రాకపోవడంతో ఆయన తీరుపై మండిపడ్డారు.
కలెక్టర్ వచ్చేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. అక్కడే వంటావార్పు నిర్వహించి భోజనాలు చేశారు. దీంతో కలెక్టరేట్‌లోకి రాకపోకలు నిలిచిపోయాయి. చీకటి పడుతుండగా టెంట్‌లు, కార్పెట్‌లు వేసుకుని.. ఎంత రాత్రైనా కలెక్టర్ వచ్చే వరకు కదలబోమంటూ బైఠాయించారు. రైతులకు బీజేపీ నేతలు వెంకటరమణారెడ్డి, రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు సుభాష్‌రెడ్డి, జమునా రాథోడ్, టీజేఎస్ నేత నిజ్జన రమేష్ తదితరులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి రైతులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు.
ఐదుగురు లేదా పది మంది రైతులు కలెక్టర్ వద్దకు వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని చెప్పారు. అయినా రైతులు వినలేదు. కలెక్టర్ వచ్చి స్వయంగా తమకు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. రాత్రి 8 గంటల తర్వాత కూడా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బయటకు రాకపోవడంతో ఆయన దిష్టి»ొమ్మకు వినతిపత్రం సమరి్పంచారు. మహిళలు కలెక్టర్ దిష్టి»ొమ్మపై ఏడు దోసిళ్ల మట్టిని విసిరారు. అనంతరం రైతులు ఆందోళన విరమించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గం బంద్‌కు రైతు ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది.
సర్పంచ్ భర్తపై దాడి
రైతులు ర్యాలీ నిర్వహిస్తుండగా ఇందిరాచౌక్ వద్ద అడ్లూర్ ఎల్లారెడ్డి సర్పంచ్ జానకి భర్త పైడి జనార్దన్ వారికి కన్పించారు. దీంతో కొందరు మహిళా రైతులు ఆయనపై దాడి చేశారు. ప్లకార్డులు, కర్రలతో చితకబాదారు. నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పించుకుని పరుగులు పెట్టిన జనార్దన్ పక్కనే ఉన్న ఓ దుకాణంలోకి వెళ్లి దాక్కున్నారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని శాంతింపజేశారు.
కేటీఆర్ స్పందించాలి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఇండ్రస్టియల్ జోన్‌లోకి మారుతున్న 2,500 ఎకరాల రైతుల భూములను వదిలేయాలని డిమాండ్ చేశారు. పుష్కలంగా పంటలు పండే భూములను ఇండ్రస్టియల్ జోన్‌గా మార్చుతారా? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ స్పందించి రైతులకు న్యాయం చేయాలన్నారు. వేలాది మంది రైతులు కలెక్టరేట్‌కు వస్తే వినతిపత్రం స్వీకరించకపోగా, రైతు ఉద్యమాన్ని హేళన చేసిన కలెక్టర్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాగా రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి కామారెడ్డికి వస్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరి్వంద్‌ను పోలీసులు 44 నంబర్ జాతీయ రహదారిపై పట్టణ శివారులో అడ్డుకున్నారు.
గుంట భూమి పోయినా పోటీ చేయను: ఎమ్మెల్యే సురేందర్
మాస్టర్‌ప్లాన్‌లో రైతులకు సంబంధించి గుంట భూమి పోయినా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వమని ఆయన అన్నారు. మాస్టర్‌ప్లాన్‌లో ఎవరి భూమీ పోకుండా మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తానని చెప్పారు. కొందరు నాయకులు అనవసరంగా రైతులను రెచ్చగొట్టి రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment